తెలంగాణ

telangana

ETV Bharat / international

సవాళ్ల మధ్య బైడెన్‌కు 'మధ్యంతర పరీక్ష'.. నిలబడతారా?

America Midterm Elections : బయట ఉక్రెయిన్‌ రూపంలో రష్యాతో యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇంట మధ్యంతర ఎన్నికల రూపంలో గట్టి పరీక్ష ఎదురు కాబోతోంది. నవంబరు 8న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అనేక సవాళ్ల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో బైడెన్ నిలబడతారా.. ట్రంప్ కనుసన్నల్లో ఉన్న రిపబ్లికన్ పార్టీ పుంజుకుంటుందా? అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.

Etv Bharatmidterm election in usa
అమెరికా మధ్యంతర ఎన్నికలు

By

Published : Oct 23, 2022, 7:25 AM IST

America Midterm Elections : బయట ఉక్రెయిన్‌ రూపంలో రష్యాతో యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇంట మధ్యంతర ఎన్నికల రూపంలో గట్టి పరీక్ష ఎదురు కాబోతోంది. వచ్చేనెల 8న అమెరికా మధ్యంతర ఎన్నికలకు వెళుతోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం, ముసురుకుంటున్న మాంద్యం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న బైడెన్‌ వ్యక్తిగత ప్రభ... వీటన్నింటినీ తట్టుకొని అధికార డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల్లో నిలదొక్కుకుంటుందా లేక ట్రంప్‌ కనుసన్నల్లో నడుస్తున్న రిపబ్లికన్‌ పార్టీ మళ్లీ పుంజుకుంటుందా? అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఏమిటీ అమెరికా మధ్యంతరం?
అధ్యక్ష ఎన్నికల తర్వాత రెండేళ్లకు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగటం ఆనవాయితీ! అమెరికా కాంగ్రెస్‌ (సెనెట్‌, ప్రతినిధుల సభ)తో పాటు రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్రాల చట్టసభలు, స్థానిక సంస్థలు, స్కూల్‌ బోర్డులు కూడా ఈ మధ్యంతరంలోనే ఎన్నికలకు వెళతాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 సభ్యులనూ ఈ మధ్యంతరంలోనే ఎన్నుకుంటారు. 100 మంది సభ్యులున్న సెనెట్‌లో మాత్రం... మూడోవంతు మంది అంటే 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ప్రతి రాష్ట్రానికి సెనెట్‌లో రెండు సీట్లుంటాయి. ప్రతినిధుల సభలో సీట్ల సంఖ్య మాత్రం ఆయా రాష్ట్రాల్లోని జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... అత్యధిక జనాభాగల కాలిఫోర్నియా రాష్ట్రం 52 మందిని ప్రతినిధుల సభకు పంపిస్తుంది. తక్కువ జనాభాగల వ్యోమింగ్‌ రాష్ట్రం ఒకరిని మాత్రమే ఎన్నుకుంటుంది. కానీ సెనెట్‌లో మాత్రం... కాలిఫోర్నియాకు, వ్యోమింగ్‌కు చెరి రెండు సీట్లు ఉంటాయి.

ఎందుకీ మధ్యంతరం?
ఎందుకంటే... సభ గడువు రెండేళ్లు మాత్రమే. సెనెట్‌లో మాత్రం ఆరేళ్లు.అధ్యక్ష ఎన్నిక 2020 నవంబరులో జరిగింది. రెండేళ్ల తర్వాత 2022 నవంబరులో మధ్యంతరం జరగబోతోంది. సాధారణంగానైతే అమెరికాలో ప్రధాన ఎన్నికలను నవంబరు తొలి మంగళవారం నిర్వహించటం ఆనవాయితీ. ఒకవేళ ఆ తొలి మంగళవారం నవంబరు మొదటిరోజైతే... రెండో మంగళవారం అంటే నవంబరు 8న ఎన్నిక జరుపుతారు.

కాంగ్రెస్‌లో పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లోని ఇరు సభల్లో జోబైడెన్‌ పార్టీ డెమోక్రట్లకు స్వల్ప మెజార్టీ ఉంది. బైడెన్‌ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రెండు సభల్లోనూ ఆమోదం అవసరం. కాబట్టి ఏ చట్టాన్ని ఆమోదించాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా కాంగ్రెస్‌పై నియంత్రణ అనేది అధ్యక్షుడికి అత్యంత కీలకం. అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలన్నింటికీ ముఖ్యంగా సెనెట్‌ ఆమోదముద్ర అత్యవసరం. అందుకే... ఈ మధ్యంతరం ఒకరకంగా బైడెన్‌ పాలనపై అభిప్రాయ సేకరణలాంటిదే.

ఎవరు గెలుస్తారు?
చరిత్రలోకి చూస్తే... చాలా సందర్భాల్లో అధ్యక్షుడి పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఓటమినే చవిచూసింది. కానీ ఈసారి ఆ ట్రెండ్‌ను తిరగరాస్తామని డెమోక్రట్లు ధీమాగా ఉన్నారు. కారణం... అబార్షన్లు చట్టబద్ధమైన హక్కు కాదని అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. మహిళల అబార్షన్‌ హక్కు విషయంలో డెమోక్రట్లు వారికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు... ఇప్పటికీ రిపబ్లిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కనుసన్నల్లోనే నడుస్తోంది. ట్రంప్‌ను బూచిగా చూపించి నెగ్గవచ్చన్నది డెమోక్రట్ల ఆలోచన.

రిపబ్లికన్‌లు గెలిస్తే?
ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌లు గెలిచి కాంగ్రెస్‌లో పట్టు సంపాదిస్తే ఏమవుతుంది? డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షుడైన జో బైడెన్‌తో పీటముడి పడుతుంది. ట్రంప్‌పై బైడెన్‌ యంత్రాంగం విచారణ ఆగిపోవచ్చు. లేదంటే... బైడెన్‌ నియమించిన అధికారులు, అనుయాయులపై సెనెట్‌ పోటీగా విచారణకు ఆదేశించవచ్చు. బైడెన్‌పై అభిశంసన ప్రక్రియా మొదలెట్టవచ్చు. మొత్తానికి 2024లో అధ్యక్ష ఎన్నికలు రాబోతున్న వేళ... కీలక నిర్ణయాలన్నింటిపైనా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.

డెమొక్రాట్లదే విజయమైతే..
ఇంటా బయటా... బైడెన్‌ దూకుడు మరింత పెరుగుతుంది. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ ప్రభావం నుంచి దూరంగా జరగటానికి ప్రయత్నించవచ్చు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌లకు, సెనెట్‌లో డెమోక్రట్లకు ఆధిక్యం లభించినా పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతుంది. రిపబ్లికన్‌లు బైడెన్‌ను అడుగడుగునా అడ్డుకుంటారు. అలాగని తమ ఎజెండా మాత్రం అమలు చేయలేరు. మరి సగటు అమెరికన్‌ ఓటరు ఏమనుకుంటున్నాడో నవంబరు 8న తెలిసిపోతుంది.

ఇవీ చదవండి:రిషి సునాక్​కు 100 మంది ఎంపీల సపోర్ట్.. యూకే తిరిగొచ్చిన బోరిస్‌ జాన్సన్

కీలక నేతలకు ఉద్వాసన.. ఆదివారమే జిన్​పింగ్​కు పట్టాభిషేకం

ABOUT THE AUTHOR

...view details