America Highest Scientific Awards :శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు జై బైడెన్ అందించారు. అందుకు సంబంధించిన చిత్రాలను శ్వేతసౌధం.. ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
సుమారు 10 కోట్లకుపైగా ప్రజలకు..
Indian American Scientists : 1950లో ముంబయిలో జన్మించిన అశోక్ గాడ్గిల్.. ముంబయి విశ్వవిద్యాలయం, ఐఐటీ కాన్పూర్‌ల నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీలు పొందారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 1980లో లారెన్స్ బర్క్‌లీ నేషనల్ లాబొరేటరీలో పనిచేసి రిటైరయ్యారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని సివిల్, పర్యావరణ ఇంజినీరింగ్ విభాగంలో గౌరవ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకుగాను..
తక్కువ వ్యయంతో కూడిన సురక్షిత తాగునీటి సాంకేతికతలు, సమర్థవంతమైన ఇంధన స్టవ్‌లు, విద్యుత్తు దీపాల అభివృద్ధిలో కృషి చేశారు అశోక్ గాడ్గిల్. ఆయన పరిశోధనా ఫలాలు సుమారు 10 కోట్లకుపైగా ప్రజలకు మేలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకుగానూ గాడ్గిల్‌కు ఈ అవార్డును అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది.
ఆ బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా-అమెరికన్
Indian American Scientists Awards : ముంబయికి చెందిన సుభ్ర సురేశ్ 1956లో జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్, ఎంఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అతి పిన్న వయస్కుడైన ఫ్యాకల్టీ సభ్యుడిగా చేరారు. అనంతరం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF)కు డైరెక్టర్ అయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా-అమెరికన్ సురేశ్ కావడం విశేషం.
అధ్యయనానికి గుర్తింపుగా..
2023లో బ్రౌన్ యూనివర్సిటీకి తిరిగివచ్చారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్‌లో చేసిన పరిశోధనలు.. ముఖ్యంగా మెటీరియల్ సైన్స్‌లో అధ్యయనానికి గుర్తింపుగా ఆయన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌ను అందిచినట్లు శ్వేత సౌధం ప్రకటించింది.