Amazon River Dolphins Dead : బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ జలాల్లో తరచుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక వేడి కారణంగా నదిలో సుమారు 100కు పైగా డాల్ఫిన్‌లు మృత్యువాత పడ్డాయి. బ్రెజిల్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేసే మామిరావా ఇనిస్టిట్యూట్ ఈ విషయాన్ని తెలిపింది. ఇంత ఎక్కువ సంఖ్యలో డాల్ఫిన్‌లు చనిపోవడం అసాధారణమని పేర్కొంది.
అమెజాన్ నదిలోని డాల్ఫిన్‌లను మరో ప్రాంతానికి తరలించాలని, లేకుంటే మరింత ఎక్కువ సంఖ్యలో అవి మృత్యువాత పడే అవకాశం ఉందని పలువురు పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డాల్ఫిన్‌లను ఇతర నదీ జలాల్లోకి మార్చాలనే ఆలోచన సరైనది కాదన్నారు. వాటిని తరలించాలని భావిస్తున్న జలాల్లో టాక్సిన్స్, వైరస్‌లు ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలోని ఉష్ణోగ్రతల కారణంగా నీటి మట్టం తగ్గిపోతోంది. సుమారు 59 మున్సిపాలిటీల్లో సాధారణ స్థాయి కంటే నీటి మట్టం తగ్గింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నదిలో రవాణా, చేపల వేట వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెజాన్ పరివాహక ప్రాంతాల్లో ఆహారం, ఇతర వస్తువులు కొనేందుకు జల మార్గాన్నే ప్రధానంగా వినియోగిస్తారు. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల అధికారులే ఆహార పదార్థాలను ప్రజలకు అందిస్తున్నారు.
అంతకుముందు కొద్ది రోజుల క్రితం అమెజాన్ నదిలో వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. గుట్టుగుట్టలుగా నదిలో చేపలు తేలిపోయాయి.