Europe Gas Crisis: రాబోయే శీతాకాలంలో తలెత్తనున్న గ్యాస్ సంక్షోభాన్ని తట్టుకోవటమెలాగా అని ఐరోపా దేశాలన్నీ తలపట్టుకుంటున్నాయి. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులను చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఇంధన పేదరికం రాబోతోందంటూ ఆందోళన చెందుతున్నారు.
రష్యాపైనే ఆధారం..
ఇప్పటికే ఐరోపా అంతటా ఇంధన సమస్య మొదలైంది. ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. చలికాలం ఆరంభం కాబోతుండటంతో ఇంధన అవసరాలు మరింత పెరగబోతున్నాయి. మరోవైపు సప్లయ్ మాత్రం డిమాండ్‌కు తగినంతగా లేదు. వీటన్నింటికీ మూలకారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.
- ఐరోపాలోని పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, ఇళ్లలో వెచ్చదనం.. అన్నింటికీ ఎక్కువ మేరకు గ్యాసే ఆధారం.
- ఈ గ్యాస్ కోసం యురోపియన్ యూనియన్‌లోని సభ్యదేశాలు రష్యాపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. వాటి గ్యాస్ వాడకంలో 40శాతం రష్యా నుంచి పైప్‌లైన్ ద్వారా వచ్చేదే.
- యుద్ధం కారణంగా అమెరికాతో కలసి ఐరోపా దేశాలన్నీ రష్యాపై కన్నెర్రజేసి ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల బూచి చూపి... పైప్‌లైన్ నిర్వహణలో ఇబ్బందులంటూ రష్యా గ్యాస్ సరఫరాపై వేటు వేసింది. ఫలితంగా ఐరోపాకు గ్యాస్ దిగుమతుల్లో 75 శాతం కోతపడింది.
- దీంతో ఐరోపా దేశాలు ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జీని కొనాల్సి వస్తోంది. ఇందుకోసం అధిక మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది అంతిమంగా ప్రజలపై భారం పడుతోంది.
- పెరుగుతున్న గ్యాస్ ధరలతో రాబోయే చలికాలంలో ఐరోపా ప్రజలు భారీగా దెబ్బతినే అవకాశముందని అంతర్జాతీయ ఇంధన ఏజన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తంజేసింది.