నేపాల్‌లో రెండు విమానాలు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఎయిర్ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లో ఉండగా పరస్పరం అతి దగ్గరగా వచ్చాయి. వార్నింగ్ సిస్టమ్స్ పైలెట్లను హెచ్చరించడం వల్ల రెండు విమానాలు ఢీకొనకుండా తప్పించుకున్నాయి. ఈ ఘటన శుక్రవారం జరిగిందని నేపాల్ పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులను సస్పెండ్ చేస్తన్నట్లు ప్రకటించారు. దీనిపై ఎయిర్ఇండియా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A-320 విమానం కాఠ్మాండూ నుంచి కౌలాలంపుర్‌కు వెళ్తోంది. ఇదే సమయంలో ఎయిర్ఇండియాకు చెందిన మరో విమానం దిల్లీ నుంచి కాఠ్మాండూకు ప్రయాణిస్తోంది. "నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అయితే, ఎయిర్ఇండియా విమానం 19,000 అడుగుల నుంచి కిందకు దిగుతోంది. దీనిని గమనించిన వార్నింగ్ సిస్టమ్స్ పైలెట్స్‌ను హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 7,000 అడుగుల కిందకు దించారు." అని ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన నేపాల్ పౌరవిమానయాన శాఖ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దీనికోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
విమానం కుప్పకూలి 72 మంది మృతి
నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. జనవరిలో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది మరణించారు. నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రకారం.. యెటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9ఎన్-ఏఎన్సీ ఏటీఆర్-72 అనే విమానం.. పొఖారాలోని విమానాశ్రయానికి సమీపంలోని సేతి నది ఒడ్డున ఈ విమానం అదుపుతప్పి కుప్పకూలింది.