Afghanisthan Earth Quake Deaths: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య శుక్రవారం 1,150కి పెరిగింది. పక్తికా, ఖోస్త్ ప్రావిన్సుల్లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తు అపార నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా సుమారుగా 3,000 ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఒక్క గయాన్ జిల్లాలోనే వెయ్యి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుండటం.. మరోవైపు పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడటం వల్ల అధికసంఖ్యలో ఇళ్లు నేలమట్టం కాగా.. ప్రజలు నిలువ నీడలేని స్థితిలో దుర్భర జీవనం సాగిస్తున్నారు. అఫ్గాన్‌లో పక్తికా ప్రావిన్సు గయాన్ జిల్లాలో శుక్రవారం మళ్లీ భూకంపం సంభవించింది. దీంతో అయిదుగురు పౌరులు మృత్యువాత పడగా, 11 మంది గాయపడ్డారు.
భారత్ సంఘీభావం
అఫ్గాన్ ప్రజలకు ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామని భారత్ పేర్కొంది. అఫ్గాన్‌కు గురువారమే రెండు విమానాల ద్వారా 27 టన్నుల సహాయ సామగ్రిని పంపించినట్లు భారత విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) శుక్రవారం వెల్లడించింది. అందులో అత్యవసర వస్తువులైన టెంట్లు, దుప్పట్లు, నిద్రపోవడానికి ఉపయోగపడే చాపలు ఉన్నాయని తెలిపింది. ఈ సామగ్రిని కాబూల్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ సంస్థ (యూఎన్‌ఓసీహెచ్‌ఏ)కు, అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ (ఏఆర్‌సీఎస్)కి అందజేయనున్నట్లు ఎంఈఏ ఓ ప్రకటనలో తెలిపింది.