తెలంగాణ

telangana

ETV Bharat / international

మరో కొత్త వైరస్ పంజా.. ఆ దేశంలో ఇద్దరు మృతి - africa marburg virus

Marburg Virus: ఆఫ్రికాలోని ఘనా దేశంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇటీవలే మరణించిన ఇద్దరి నమూనాలు పరీక్షించగా 'మర్​బర్గ్'​ వైరస్‌గా నిర్ధరణ అయ్యింది. ఎబోలా వైరస్ మాదిరిగానే ఇది కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

MARBURG VIRUS
MARBURG VIRUS

By

Published : Jul 18, 2022, 10:51 PM IST

Marburg Virus: కరోనా వైరస్‌ కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచాన్ని కొత్త వైరస్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన మర్‌బర్గ్‌ వైరస్ కేసులు బయటపడటం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ కొత్త వైరస్‌ కారణంగా ఇద్దరు మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఎబోలా తరహా లక్షణాలు కలిగిన వైరస్‌ కారణంగా ఈనెల మొదట్లోనే ఆ ఇద్దరు మృతిచెందారు. కాగా ఆసుపత్రిలో చనిపోయే ముందు వారు డయేరియా, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత మర్‌బర్గ్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. కాగా అప్రమత్తమైన ఘనా ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్‌ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కు తరలించి వారిని పరీక్షిస్తోంది. కాగా ఇప్పటివరకు మరే ఇతర వ్యక్తిలో మర్‌బర్గ్‌ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. పశ్చిమాఫ్రికాలో మొత్తంగా మర్‌బర్గ్‌ కేసులు వెలుగుచూడటం ఇది రెండోసారి మాత్రమే. మొట్టమొదటిసారి గతేడాది గినియా దేశంలో ఈ కేసులు బయటపడ్డాయి.

"ఘనా ఆరోగ్యాధికారులు వేగంగా స్పందించి వైరస్‌ నివారణ చర్యలు చేపట్టడం హర్షనీయం. తక్షణ, నిర్ణయాత్మక చర్యలతో మర్‌బర్గ్‌ నుంచి సులభంగా బయటపడవచ్చు."
-- మాట్షిడిసో, డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్

మర్‌బర్గ్‌ అంటే..?
ఎబోలా కుటుంబానికి చెందిన మర్‌బర్గ్‌ వైరస్ ఓ అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు లేదా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశాలుఉన్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ 2-21 రోజులపాటు ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుంది.

ఇవీ చదవండి:గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్​ చేసి రక్షించిన సిబ్బంది

మాల్​ ఫుడ్​ కోర్ట్​లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details