Afghanistan Earthquake deaths: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మరో 1,500మంది గాయపడినట్లు అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి.
అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో.. 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. పాక్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్ అధికారులు తెలిపారు.