Afghanistan Earthquake Death Toll :అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరిగింది. భూకంప విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటింది. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వేలాది మంది తీవ్ర గాయాలపాలనైట్లు ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.
శనివారం మధ్యాహ్నం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా.. 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అనంతరం 6.3, 5.9, 5.5 తీవ్రతతో పాటు పలుమార్లు చిన్న భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని.. వందల మంది ప్రజలు మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆరు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని.. వందలాది మంది పౌరులు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారని అఫ్గాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అబ్దుల్ వాహిద్ రయాన్ తెలిపారు. తక్షణ సహాయం కోసం ముందుకు రావాలని సంపన్న దేశాలను అభ్యర్థించారు. అయితే ప్రస్తుతం నమోదైన లెక్కల కంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని మంత్రి అబ్దుల్ వాహిద్ చెప్పారు.
"భూకంపం ధాటికి అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాలు అన్నీ ఖాళీ అయ్యాయి. మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. భూకంపం వచ్చే సమయంలో నేను నా కుటుంబంతో ఇంట్లో ఉన్నాను. భూప్రకంపనలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాము"
-- అబ్దుల్ షకోర్ సమాది, స్థానికుడు
మరోవైపు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్ఓ 12 అంబులెన్సులను జెండా జాన్‌కు పంపించింది. భూకంపం వల్ల హెరాత్‌లో టెలిఫోన్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి సమాచారం రావడం ఇబ్బందిగా మారింది. భూకంప బాధితులకు వీలైనంత త్వరగా అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని తాలిబన్ ప్రభుత్వం స్థానిక సంస్థలను ఆదేశించింది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భద్రతా సంస్థలు.. తమ వనరులు, సౌకర్యాలను ఉపయోగించుకోవాలని చెప్పింది.
Afghanistan Earthquake 2023 : అఫ్గాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
భూకంపానికి 2వేల మంది బలి.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం!.. శిథిలాల కిందే అనేక మంది..