Afghanistan Earthquake 2023 : అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఫ్రాథమికంగా 320 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. తొలుత 320 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ తర్వాత ఈ సంఖ్య ఇంకా పరిశీలలోనే ఉందని వివరించింది. కాగా, స్థానిక అధికారుల లెక్కల ప్రకారం 100 మంది మరణించగా.. మరో 500 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు.
సాయం చేయాలని కోరిన తాలిబన్లు
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు 12 అంబులెన్సులను పంపినట్లు అఫ్గాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు తరలించాలని స్థానిక సంస్థలకు ఆదేశించారు తాలిబన్లు. నిర్వాసితులకు ఆహారం, పునరావాసం కల్పించాలని చెప్పారు. బాధితులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Afghanistan Earthquake Today Death : పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో శనివారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.3గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించారు. హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే వెల్లడించింది. "మేమంతా కార్యాలయంలో పనిలో నిమగ్నమయ్యాం. హఠాత్తుగా భవనమంతా కంపించింది. గోడలు బీటలు పారడం వల్ల భయంతో పరుగుతీశాం" అని ఒకరు తెలిపారు.