Afghanistan Crisis 2023 :తాలిబన్ల ఆటవిక పాలనలో అఫ్గానిస్థాన్ ప్రజల బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయి. దేశమంతటా దారిద్య్రం తాండవిస్తోంది. తినడానికి తిండిలేక లక్షలాది పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. సరైన వేతనాలు లేకపోవడం వల్ల కుటుంబ పోషణ సైతం భారంగా మారింది. అక్కడి ప్రజలకు ఆహారం కోసం ఇంట్లో వస్తువులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. అమెరికా, నాటో బలగాలు దేశం నుంచి వెళ్లిన తర్వాత.. అఫ్గాన్ పౌరుల జీవితాలు దినదిన గండాలుగా మారాయి.
అఫ్గానిస్థాన్‌లో 2021లో అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టారు. అప్పటి నుంచి అక్కడి పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. తాలిబన్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజుకు 2 పూటలు కడుపు నిండా తిండి తినలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. సంప్రదాయ పాలన పేరుతో తాలిబన్లు సాగిస్తున్న అరాచక పాలనతో దేశంలో ఉద్యోగాలు కనుమరుగయ్యాయి.
వస్త్ర తయారీపై ఆంక్షలు, బ్యూటీపార్లర్లపై నిషేధం వంటి వాటితో ఉద్యోగ కల్పన మరింత కష్టంగా మారింది. నిత్యావసరాల కోసం అఫ్గాన్‌లు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తాలిబన్‌లు కోతలు విధిస్తున్నారు. పౌరులు వారి సొంత డబ్బును.. వారానికి ఒకేసారి అది కూడా పరిమితంగానే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోవాలన్న ఆంక్షలు అక్కడ అమల్లో ఉన్నాయి.