తెలంగాణ

telangana

ETV Bharat / international

షరియా అమలు చేస్తున్న తాలిబన్లు.. మహిళలకు కొరడా దెబ్బలు! - Afghanistan implementing Sharia

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. షరియానూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేసుల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగ శిక్షలు విధించారు.

Afghanistan implementing Sharia
అఫ్గానిస్థాన్‌లో బహిరంగ శిక్ష

By

Published : Nov 20, 2022, 10:17 PM IST

తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్‌లో మహిళలపై అణచివేతకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు. షరియాకు లోబడే ఈ శిక్ష అమలు చేసినట్లు తాలిబన్లు సమర్థించుకున్నారు.

ఈశాన్య ప్రాంతమైన తఖార్‌ ప్రావిన్సులోని తలూఖన్‌ నగరంలో మొత్తం 19 మందికి కొరడా దెబ్బలు విధించగా.. అందులో 10మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు అధికారి అబ్దుల్‌ రహీం రషీద్‌ వెల్లడించారు. నవంబర్‌ 11న మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలోనే ఈ శిక్ష అమలు చేశామన్నారు. గతేడాది ఆగస్టులో అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత.. కొరడా దెబ్బలతో శిక్షించినట్లు తాలిబన్లు అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

1990ల్లో అఫ్గాన్‌ పౌరులపై తమ ప్రతాపాన్ని చూపిన తాలిబన్లు.. న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీయడం, కొరడా దెబ్బలతో శిక్షించడం, రాళ్లతో కొట్టడం వంటి దారుణాలకు పాల్పడేవారు. గతేడాది తమ బలగాలను అమెరికా ఉపసంహరించురించుకున్న తర్వాత తాలిబన్లు మళ్లీ ఆ ప్రాంతాన్ని వశం చేసుకున్నారు. మహిళలు, చిన్నారుల హక్కులను కాపాడతామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. బాలికల విద్య, మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా షరియా చట్టాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా అఫ్గాన్‌లో జరుగుతోన్న తాలిబన్ల అరాచకాలపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details