japan former pm Shinzo Abe: భవిష్యత్తును ఎంతో ముందుగానే ఊహించగలిగే నేతగా షింజో అబెకు మంచి పేరుంది. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు కలిస్తే చైనాకు పగ్గాలు వేయవచ్చని ఆయన ఎంతో ముందుగానే ఊహించారు. భారత్ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ.. దీనికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జపాన్ ఆర్థికంగా దెబ్బతిని అవమాన భారంతో ఉంది. ఈ క్రమంలో 1957లో ఆ దేశ ప్రధాని, షింజో తాత నొబుసుకె కిషి భారత్ పర్యటనకు వచ్చారు. ఆయనకు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. 'నేను ఎంతో గౌరవించే జపాన్ ప్రధాని' అని ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఘటన కిషి మనసును తాకింది. ఆయన తన దేశానికి వెళ్లిన తర్వాత మనవడికి భారత పర్యటన విశేషాలు.. ఆత్మీయ ఆతిథ్యాన్ని వివరించారు. ఆ విషయాలు చిన్నారి మనసులో నాటుకు పోయాయి. కాల చక్రం వేగంగా తిరిగింది.. 2006లో ఆ మనవడే జపాన్ ప్రధాని అయ్యారు. ఆయనే షింజో అబె. తాత పర్యటన జరిగిన 50 ఏళ్లకు ఆయన భారత్‌కు వచ్చారు.. ఇక్కడి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి 'రెండు సముద్రాల సంగమ' వ్యూహంపై ప్రసంగించారు. అప్పట్లో ఆ ప్రతిపాదన సంచలనమైంది. ఆయన ప్రస్తావించిన అంశమే 'ఇండో-పసిఫిక్ వ్యూహం'గా రూపాంతరం చెంది చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే అమెరికాను భారత్‌కు దగ్గర చేసింది.
జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా..:జపాన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేత షింజో అబె. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తికి రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చింది ఆయనే. అబె 2006లోనే ప్రధాని అయినా.. పెద్దపేగు సమస్యతో ఏడాదికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ఆరేళ్లలో ఆరుగురు ప్రధానులు మారారంటే అక్కడి రాజకీయ అస్థిరతను అర్థం చేసుకోవచ్చు. దీంతో 2012లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏకధాటిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగారు.
అబెనామిక్స్ రూపకర్త..:తాత స్థాపించిన 'లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ' నుంచి ఈ పదవి చేపట్టిన అబెకు అడుగడుగునా సవాళ్లే ఎదురయ్యాయి. 2012లో అధికారం చేపట్టే నాటికి జపాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించింది. కరెన్సీ యెన్ విలువ విపరీతంగా పెరగడంతో.. పారిశ్రామిక రంగంపై ఆధారపడిన జపాన్‌కు ఎగుమతుల్లో లాభాదాయకత తగ్గిపోయింది. ఈ క్రమంలో అబె చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్ వృద్ధిరేటును పట్టాలెక్కించాయి. బ్యాంకింగ్ పరపతి విధానంలో చేసిన మార్పులు ఆర్థిక వ్యవస్థపై ఔషధంలా పనిచేశాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఛైర్మన్‌గా హరుహికో నియామకం ఫలితాన్నిచ్చింది. ఆయన.. వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని భారీగా పెంచారు. షింజో ఆర్థిక విధానాలు జపాన్‌లో 'అబెనామిక్స్'గా ప్రసిద్ధి చెందాయి.
దౌత్య వ్యూహాలు తెలిసిన నేర్పరి..:అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక జపాన్-అమెరికా సంబంధాలు దెబ్బతినకుండా కాపాడిన ఘనత కూడా అబెకు దక్కుతుంది. అబె 'గోల్ఫ్ దౌత్యం' కొంత మేరకు పనిచేసింది. దేశ భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని అబె మెల్లగా తగ్గించుకొనే ప్రయత్నాలు చేపట్టారు. ఎన్ని విమర్శలు ఎదురైనా 'జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు'ను శరవేగంగా ఆధునికీకరిస్తూ వచ్చారు. ఒక దశలో సైనికపరంగా జపాన్ దూకుడును కట్టడి చేసే ఆర్టికల్-9ను సవరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
'క్వాడ్' ఆలోచన ఆయనదే..:విదేశాంగ విధానంలో షింజో అబె నేర్పు ప్రపంచ ధ్రువాలనే మార్చిందని చెప్పొచ్చు. ఆయన చైనా ముప్పును దాదాపు పుష్కరకాలం ముందే పసిగట్టి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన బలమైన చతుర్భుజ కూటమికి 2007లోనే ప్రాణం పోశారు. రక్షణ వ్యూహాల్లో హిందూ-పసిఫిక్ మహాసముద్రాలను కలిపిచూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇదే భారత్-జపాన్ సంబంధాలకు మూలస్తంభంగా మారింది. 2015 నుంచి మలబార్ యుద్ధ విన్యాసాల్లో శాశ్వత భాగస్వామిగా మారింది. చతుర్భుజ కూటమి దేశాలను సమన్వయం చేసుకోవడంలో చురుగ్గా వ్యవహరించారు. కొవిడ్ తర్వాత చైనా నుంచి జపాన్‌కు చెందిన తయారీ రంగ సంస్థలను బయటకు తెచ్చేందుకు ఏకంగా 220 కోట్ల డాలర్లను కేటాయించారు.
దిల్లీకి ఆత్మీయుడిగా..:షింజో అబె విదేశాంగ విధానంలో భారత్ కేంద్రస్థానంలో ఉంది. ఆయన తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో నాలుగు సార్లు భారత్‌ను సందర్శించడం ఓ రికార్డు. మరే జపాన్ ప్రధాని ఇన్నిసార్లు భారత్‌కు రాలేదు. భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి జపాన్ ప్రధానిగా 2014లో ఘనతికెక్కారు. యూపీఏ అనంతరం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాలు నెరిపారు. భారత్-జపాన్ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయంగా మిగిలిపోతుంది. 2014లో మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను పటిష్ఠం చేసుకొనేలా ఓ అణుఒప్పందానికి బీజం పడింది. ఎన్‌పీటీ సంతకం చేయని భారత్‌తో అణుఒప్పందం చేసుకోవడం జపాన్‌కు అతిపెద్ద సవాల్. పెట్టుబడులతోపాటు.. జపాన్‌కు ఈపీఆర్ రియాక్టర్లు, సురక్షిత పరికరాలు, రియాక్టరల డోమ్‌ల విషయంలో ఏకఛత్రాధిపత్యం ఉండటం భారత్‌కు లబ్ధిచేకూర్చే అంశం. షింజో నేతృత్వంలో 2016లో ఈ ఒప్పందం కుదిరింది. ఇది 2017 నుంచి అమల్లోకి వచ్చింది. అంతేకాదు భారత్‌లోని ఇన్ఫ్రా ప్రాజెక్టులకు జపాన్ భారీగా నిధులను సమకూర్చింది. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ.88వేల కోట్లను నామమాత్రపు వడ్డీకి ఇచ్చింది. 2016లో భారత ప్రధాని జపాన్ పర్యటన సందర్భంగా 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 2018లో జరిగిన 13వ ఇండో-జపాన్ వార్షిక సదస్సులో ఏకంగా 32 ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి. జపాన్‌తో బలపడుతున్న మైత్రికి ఇది చిహ్నంగా నిలిచింది. భారత్‌లో ఏటా జపాన్ పెట్టే పెట్టుబడులు దాదాపు 350 కోట్ల డాలర్లకు చేరాయి.
చైనాకు భయపడకుండా.. అరుణాచల్‌లో పెట్టుబడులకు ఆసక్తి:చైనా దెబ్బకు భయపడి అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాల నిధులు సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థలు వెనకడుగు వేస్తే జపాన్ మాత్రం ధైర్యంగా దాదాపు రూ.13వేల కోట్లను ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఏఏ ఆందోళనల కారణంగా గువాహటీలో షింజో అబె హాజరుకావాల్సిన '2019 ఇండో-జపాన్' వార్షిక సదస్సు వాయిదా పడటంతో ఈ ప్రతిపాదనలు నిలిచాయి. 2020 సెప్టెంబర్‌లో అనారోగ్య కారణాల రీత్యా షింజో పదవి నుంచి వైదలగారు. ఆ తర్వాత వచ్చిన ప్రధానులు యషిది సుగా, ఫుమియో కిషిదా కూడా షింజోకు అత్యంత సన్నిహితులు. దీంతో ఆయన వారసత్వాన్ని జపాన్‌లో కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి:9 మంది పిల్లలకు తండ్రైన 'మస్క్'.. జననాల రేటు పెంచేందుకేనట!
'ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆకలికేకలు.. బిగిస్తున్న ఊబకాయం'.. ఐరాస నివేదిక