ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా మారుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్ పోర్ట్ సిటీగా పేరుగాంచిన కరాచీకి సమీపంలోని కెమరీ ప్రాంతంలో చిన్నారుల మరణం కలకలం రేపింది. ఓ అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు.
ఆర్థిక సంక్షోభం వేళ పాక్కు మరో తలనొప్పి.. అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి
పాకిస్థాన్‌లో ఓ అంతుచిక్కని వ్యాధికి 18 మంది బలయ్యారు. మృతుల్లో 14 మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
జనవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కాలంలో కెమరీ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో 18 మంది మృత్యువాతపడ్డారు. అందులో 14 మంది చిన్నారులే ఉన్నారని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ ధ్రువీకరించారు. మరణాలకు కారణాలు తెలియనప్పటికీ.. నివాసితులు తీర ప్రాంతం సమీపంలో ఉండడం వల్ల సముద్రపు నీటికి సంబంధించి ఏదైనా సమస్యతో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా కెమారిలోని మావాచ్ గోత్ గ్రామం ఓ మురికివాడ ప్రాంతం. ఇక్కడి ప్రజలు ఎక్కువగా మత్స్యకార అనుభంద పనులపై ఆధారపడి రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తుంటారు. అయితే మృతులు చనిపోయే ముందు తీవ్ర జ్వరం, గొంతు దగ్గర వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్నారని వైద్యాధికారులు వెల్లడించారు. అయితే, ఆ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వింత వాసన వస్తుందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడే ఉన్న మూడు పరిశ్రమల్లో తయారు చేసే పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నామని నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.