65 ఏళ్ల వయసున్న ఓ నగర మేయర్ 16 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ వింత పెళ్లి బ్రెజిల్లో జరిగింది. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగరానికి చెందిన హిస్సామ్ హుస్సేన్ దేహైని వయసు 65 ఏళ్లు. ఆయన ప్రస్తుతం అరౌకారియా మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే తన కన్నా 49 ఏళ్లు చిన్నదైన ఓ 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని వివాదంలో చిక్కుకున్నారు దేహైని. ఆమెను పెళ్లి చేసుకున్న అనంతరం వధువు తల్లిని స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిని చేశారు. ఈ విషయం బయటపడడం వల్ల మేయర్.. అవినీతి, బంధుప్రీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఫలితంగా ఈ ఘటనపై విచారణ సంస్థలు దర్యాప్తును మొదలుపెట్టాయి.
బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల పైబడిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే.. వారి తల్లిదండ్రుల అనుమతితో చేసుకోవచ్చు. దీంతో అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటి రోజే వివాహం చేసుకున్నారు దేహైని. అయితే, అమ్మాయి తల్లికి అంతకుముందే విద్యా శాఖలో ఉద్యోగం ఉంది. కానీ తక్కువ జీతం, హోదా కావడం వల్ల.. పెళ్లైన తర్వాత పర్యటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు దేహైని.
అయితే, ఈ నియామకం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సిటీ సివిల్ రిజిస్ట్రీ హిల్దా లక్లాసీ సీమా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈమె ప్రస్తుతం నగరానికి డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేహైనితో కలిసే సీమా.. 2016, 2020 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ వివాదంపై స్పందించిన మేయర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. మేయర్.. తనకున్న విచక్షణ అధికారాల మేరకు.. నిబంధనలకు లోబడే ఆమెను కార్యదర్శిగా నియమించారని తెలిపింది. ఆమెకు ప్రజాసేవలో 26 ఏళ్ల అనుభవం ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. కానీ మేయర్ కార్యాలయం చేసిన ప్రకటనను సీమా తోసిపుచ్చారు.