తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐదో రోజు అట్టుడికిన ఫ్రాన్స్​.. ఆగని ఆందోళనలు, లూటీలు..

France Riots 2023 : ఫ్రాన్స్‌.. గత 5 రోజులుగా ఆందోళనకారులు పాల్పడుతున్న హింసకు మౌనసాక్షిగా నిలుస్తోంది. నహేల్‌ అనే పదిహేడేళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపడం వల్ల మొదలైన నిరసన జ్వాలలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆందోళనలు, లూటీలు, అల్లర్లతో ఫ్రాన్స్‌ నగరాలు అట్టుడుకుతున్నాయి. పారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా పలు నగరాల్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు ఐదో రోజూ వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పది షాపింగ్‌ మాళ్లు, 200లకు పైగా సూపర్‌ మార్కెట్లు, 250 బ్యాంకు సేవా కేంద్రాలతోపాటు ఇతర దుకాణాలపై దాడులు చేసి లూటీ చేశారు. శాంతిని నెలకొల్పేందుకు 45 వేల మందికిపైగా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,800 మందిని అరెస్టు చేశారు.

France Riots 2023
France Riots 2023

By

Published : Jul 2, 2023, 10:40 PM IST

France Riots Cause Nahel : మైనారిటీ వర్గానికి చెందిన పదిహేడేళ్ల నహేల్‌ అనే యువకుడిని తనిఖీల సమయంలో ఫ్రాన్స్‌ పోలీసులు గత మంగళవారం కాల్చిచంపారు. ఈ ఘటన జరిగిన పారిస్‌ శివారు ప్రాంతమైన నాంటెర్రిలో కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఫ్రాన్స్‌ ప్రధాన నగరాలైన పారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా పలు ప్రాంతాలకు విస్తరించాయి. భారీ ఎత్తున రోడ్లపైకి వస్తున్న నిరసనకారులు కనిపించిన కార్లు, భవనాలను తగులబెడుతున్నారు. 2,500 చోట్ల నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల సాయంతో యువకులు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు. హింసాకాండకు ఆజ్యం పోయడంలో ఇవి కీలకపాత్ర పోషించాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ ఆరోపించారు.

పహారా కాస్తున్న పోలీసులు

France Protest Update : నిరసనకారులు కొందరు గుంపులుగా వచ్చి దుకాణాలను లూటీ చేశారు. మార్సెయిల్‌లో ఓ తుపాకుల దుకాణంలోకి చొరబడిన అల్లరిమూకలు ఆయుధాలు ఎత్తుకెళ్లారు. వందల సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. 45 వేల మంది పోలీసులను రంగంలోకి దింపినప్పటికీ ఆందోళనకారులను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు 2,800 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. శనివారం రాత్రినుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 719 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా యువతే ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల భద్రత కారణంగా నిరసనలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

పహారా కాస్తున్న పోలీసులు

Paris Violence News : చైనీయుల విహారయాత్ర బృందంతో వెళుతున్న బస్సును ఆందోళనకారులు చుట్టుముట్టారు. బస్సు కిటికీలను ధ్వంసం చేశారు. దీంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన మార్సెయిల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఫ్రాన్స్‌కు ఫిర్యాదు చేసింది. చైనా పౌరులు, వారి ఆస్తుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఫ్రాన్స్‌దేనని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఉన్న చైనా పౌరులు లేదా ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకునే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.

నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు

France Protest 2023 : ఉత్తర పారిస్‌ పరిసరాల్లో నిరసనకారులు బాణసంచా కాలుస్తూ బారికేడ్‌లను తగులబెట్టారు. పోలీసులు భాష్పవాయు గోళాలు, స్టన్ గ్రెనేడ్‌లతో ఎదురు కాల్పులు జరిపారు. దక్షిణ పారిస్ శివారు ఎల్ హై-లెస్-రోజెస్ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంటిని నిప్పంటించిన కారుతో ఢీకొట్టారు. ఈ దాడిలో మేయర్‌ భార్య, పిల్లలలో ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్‌ గయనాలో బుల్లెట్‌ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మరణించారు. మార్సెయిల్‌లో గత రాత్రి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2 రోజుల కంటే దేశవ్యాప్త అరెస్టులు కొంత తక్కువగా నమోదయ్యాయని భద్రతా దళాల నిరంతర పహారానే దీనికి కారణమని ఫ్రాన్స్‌ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ పేర్కొన్నారు.

పారిస్ సహా ఇతర ఫ్రెంచ్ నగరాలు వచ్చే ఏడాది ఒలింపిక్ అథ్లెట్లతో పాటు లక్షాలాది మంది సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హింస చెలరేగటం వల్ల ఒలంపిక్‌ నిర్వాహకులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.అధ్యక్షుడు మేక్రాన్‌ సోమవారం జర్మనీకి వెళ్లాల్సి ఉంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌-వాల్టర్‌ స్టీన్‌మెయిర్‌కు ఫోన్‌ చేసి తన పర్యటన వాయిదా విషయం తెలిపారు. మరోవైపు పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నహేల్‌ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు. తన బిడ్డను పోలీసు అధికారి అన్యాయంగా చంపేశారని నహేల్‌ తల్లి కన్నీరు పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details