ఈమధ్య కాలంలో సరోగసీ అనే పదాన్ని బాగా వింటున్నాం. సెలబ్రిటీలతోపాటు అనేక మంది జంటలు ఈ విధంగానే తల్లిదండ్రులయ్యారు. ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందిన ఓ మహిళ తన కుమారుడి బిడ్డకు (మనవరాలికి) సరోగసీ విధానంలో జన్మనివ్వడం విశేషం. యూటా రాష్ట్రానికి చెందిన నాన్సీ హాక్, కాంబ్రియా దంపతులకు ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. అయితే, కొద్దికాలం క్రితం కాంబ్రియా అనారోగ్యానికి గురవడంతో ఆమె గర్భసంచిని వైద్యులు తొలగించారు. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నప్పటికీ.. ఆ దంపతులు మరో బిడ్డ కావాలని ఆశపడ్డారు. సంతానం కోసం పలు విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఏదీ సఫలం కాలేదు.
దీంతో సరోగసీ విధానంలో తన కుమారుడు, కోడలికి సంతానాన్ని అందించేందుకు జెఫ్ హాక్ (56) ముందుకొచ్చింది. తొమ్మిది నెలలు పిండాన్ని కడుపులో మోసిన ఆమె తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఓ 'అద్భుతమైన క్షణం'గా నాన్సీ హాక్ అభివర్ణించాడు. 9గంటలపాటు ప్రసవ వేదనకు గురైన జెఫ్ హాక్ మాట్లాడుతూ.. దీన్ని 'ఆధ్యాత్మిక అనుభవం' అని పేర్కొంది. ఆ చిన్నారికి 'హన్నా'గా నామకరణం చేశారు.