Long Covid Symptoms: కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్ వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇన్‌ఫెక్షన్ బారినపడిన నుంచి నెలల తరబడి వారిని కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయని తెలిపింది. కొవిడ్ సోకిన అనంతర ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలైన వారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్ అక్యూట్ సీక్వెలే ఆఫ్ కొవిడ్‌గా (PASC) పిలిచే 'లాంగ్ కొవిడ్' ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ (UCLA) పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాల కొవిడ్‌పై 309 మంది బాధితులపై అధ్యయనం చేపట్టగా.. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15 శాతం) వంటి లక్షణాలతో బాధపడినట్లు గుర్తించారు. ఇక వాసన గుర్తించకపోయే లక్షణం 16 శాతం మందిలో కనిపించిందన్నారు.