Pakistan Blast News: పాకిస్థాన్లోని కరాచీ యూనివర్సిటీ పరిధిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చైనా దేశస్థులు ఉండటం గమనార్హం. ఆత్మాహుతి దాడి కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది వారిని టార్గెట్ చేసి జరిపిన పేలుడు అని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతులు వ్యాన్లో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత తీవ్రవాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. యూనివర్సిటీలోని చైనా నిర్మించిన కన్ఫుసియస్ ఇన్స్టిట్యూట్ వద్ద పేలుడుజరిగింది. స్థానికులకు చైనీస్ నేర్పించడం కోసం చైనా ఇదివరకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసింది.
మృతులను.. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గిపింగ్, డింగ్ ముపెంగ్, చెన్ సా, ఖలీద్లుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనలో వాంగ్ యుగింక్, హమీద్ అనే మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉందన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. బుర్ఖా ధరించిన ఓ మహిళ చైనీయులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఇన్స్టిట్యూట్ ఎంట్రెన్స్ వద్దకు రాగానే ఆత్మాహుతికి పాల్పడింది. నిందితురాలిని షారీ బలూచ్ అలియాస్ బ్రంష్గా గుర్తించారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.