2023 Nobel Peace Prize Winner : 2023 ఏడాదిగానూ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికిగానూ.. ఈ అవార్డు అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నార్గెస్ మొహమ్మదిని ఇరాన్ ప్రభుత్వం 13సార్లు అరెస్ట్ చేసిందని.. ఐదుసార్లు దోషిగా ప్రకటించిందని నార్వే నోబెల్ కమిటీ తెలిపింది. మొత్తం 31ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు వెల్లడించింది. దాంతోపాటు 154 కొరడా దెబ్బలు కొట్టినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ఆమె సాహోసోపేతమైన పోరాటం వ్యక్తిగతంగా తీవ్రనష్టం కలిగించినట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రశంసించింది. నార్గెస్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నట్లు తెలిపింది.
2022 సెప్టెంబర్‌లో హిజాబ్ ధరించనందుకు 22ఏళ్ల మాస అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమె కస్టడీలో చనిపోయింది. ఆ తర్వాత పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ అల్లర్లలోనే నార్గెస్ మొహమ్మదిని అక్కడి ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఈ నేపథ్యంలో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎప్పుడూ చూడనంత అతిపెద్ద సవాల్‌ను ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంది. పోలీసు కాల్పుల్లో 500 మంది చనిపోగా ఇరాన్ ప్రభుత్వం 22వేల మందిని అరెస్ట్ చేసింది.
నోబెల్ శాంతి పురస్కారం పొందిన 19వ మహిళగా నార్గెస్ మొహమ్మదిని నిలిచారు. దాంతోపాటు ఈ అవార్డు అందుకున్న రెండో ఇరాన్ మహిళగా ఆమె పేరు గడించారు. ఇరాన్ నుంచి నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న మొదటి మహిళగా శిరిన్ ఎబది నిలిచారు. 2003లో ఆమె ఈ అవార్డ్‌ను అందుకున్నారు. శిరిన్ ఎబది మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశారు. ఇరాన్‌లో ఈమె డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌ను స్థాపించారు. జైలుకు వెళ్లక ముందు డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కు నార్గెస్ మొహమ్మదిని ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. శిరిన్ ఎబడికి నార్గెస్ సన్నిహితంగా ఉండేవారు.