గ్లోబల్ అజెండాను ముందుకు తీసుకెళ్లే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భారత్, అమెరికా సంబంధాల్లో 2022 ఏడాది కీలకంగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఏడాది ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని అన్నారు. ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల ముగిసిన G-20 సదస్సు సందర్భంగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో మోదీ చేసిన వ్యాఖ్యలు కీలక పాత్ర పోషించాయన్నారు.
"భారత్-అమెరికా మధ్య 2022లో మంచి సత్సంబంధాలు కొనసాగాయి. 2023లోనూ ఇంకా మెరుగుగైన సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నాము. భారత్‌తో బంధాన్ని ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన సంబంధాలలో ఒకటిగా బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచ వ్యాప్తంగా భాగస్వాములను అమెరికా వెతుకుతున్నప్పుడు భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఆ జాబితాలో భారత్‌కు, ప్రధాని మోదీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది."
-జాన్ ఫైనర్, డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ, అమెరికా