ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో దూసుకుపోతున్న రష్యాకు కెర్చ్ వంతెన కూల్చివేతతో పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు ఉక్రెయిన్‌పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు తొలుత అంతా భావించారు. కానీ దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. క్రిమియా ద్వీపకల్పంలో కొంతకాలంగా జరిగిన పరిణామాలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కెర్చ్ వంతెనపై పేలుడు జరిగిన సమయంలో దీనిపై ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న మరో వంతెనపై ఓ రైలు ఇంధన వ్యాగన్లతో ట్రక్కు సమీపంలోకి రాగానే భారీ పేలుడు సంభవించింది. కానీ, ఈ పేలుడు కచ్చితంగా ట్రక్కు నుంచే జరిగినట్లు ఎక్కడా తెలియడం లేదు. వేర్వేరు కోణాల్లో ఈ దృశ్యాలను పరిశీలిస్తే పేలుడుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.
పేలుడు జరిగిన రోజే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ట్విటర్ ఖాతా OSINT అమెచ్యూర్ ఓ వీడియో క్లిప్ విడుదల చేసింది. దానిలో వంతెనపై ట్రక్కు ఓ ప్రదేశంలోకి రాగానే.. వంతెన పిల్లర్ల మధ్య నుంచి.. ఓ చిన్నపాటి పడవ వంటిది తేలుతూ బయటకు వచ్చింది. మరు క్షణమే భారీ పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం తతంగం పక్కనే ఉన్న వంతెనపై అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. సముద్రపు డ్రోన్ సాయంతో ఈ దాడి చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.