రెండు వాయుసేన విమానాలు ఢీ- నలుగురు మృతి - విమాన ప్రమాదాలు
11:29 April 01
రెండు వాయుసేన విమానాలు ఢీ- నలుగురు మృతి
South Korea Plane Crash: దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఘటన తర్వాత సచియాన్ నగరానికి సమీపంలో ఉన్న లోయ ప్రాంతంలో ఈ విమానాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు సహా పలువురు సిబ్బందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఘటనాస్థలం వద్ద ఎవరైనా స్థానికులు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
కేటీ-1 మోడల్‌కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శిక్షణా సమయంలో గాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విమానాల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరని వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు జనవరిలో కూడా దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఎఫ్-5ఈ రకానికి చెందిన ఈ విమానం కొండను ఢీకొనడం వల్ల పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.