Boat Accident Wedding Procession: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో భాగంగా సుమారు వంద మందితో నదిలో విహరిస్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..పంజాబ్ ప్రావిన్స్‌లోని మచ్కా ప్రాంతంలో ఓ వివాహం ఘనంగా జరిగింది. అనంతరం సుమారు వంద మంది ఖరోర్ గ్రామానికి ఊరేగింపుగా పయనమయ్యారు. సింధు నదిలో ఆడుతూ పాడుతూ పడవలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే, కాసేపటికే వారి పడవలోకి నీరు రావడం వల్ల ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. అందులో చాలా మంది పురుషులకు ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది మహిళలు మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. సుమారు 30 మందిని స్థానికులు రక్షించారు.