Fake COVID Test Center Germany: కరోనా రెండేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కట్టడికి.. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ విస్తృతంగా నిర్వహించడమే మార్గమని వైద్యనిపుణులు, ప్రపంచ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇదే అదనుగా భావించిన ఓ టీనేజర్.. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి కోట్లు ఆర్జించాడు. నకిలీ కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని సృష్టించి.. ఫేక్ ఇన్వాయిస్లతో ఏకంగా రూ. 46 కోట్లకుపైనే(6 మిలియన్ డాలర్లు) సంపాదించాడు 17 ఏళ్ల బాలుడు. జర్మనీలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది: జర్మనీలో గతేడాది కొవిడ్ ఉగ్రరూపం దాల్చింది. రోజుకు సగటున లక్ష కేసులు నమోదయ్యాయి. అప్పుడే టెస్టులకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ కేంద్రాలు సరిపోక.. పలు ప్రైవేటు వారిని ముందుకురావాలని కోరింది ప్రభుత్వం. ఇన్వాయిస్ల ఆధారంగా డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీంతో.. ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్లు బాగా ప్రయోజనం పొందారు. అదే సమయంలో జర్మనీకి చెందిన ఓ బాలుడు.. అందులోని లోపాల్ని తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. పేపర్‌పై కొవిడ్ కేంద్రాన్ని సృష్టించి.. నకిలీ ఇన్వాయిస్లతో రోజుకు వేల టెస్టులు చేసినట్లు నమ్మించి ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాడు. 2020లో తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడే బాలుడికి ఈ ఆలోచన తట్టింది. మరుసటి ఏడాది ఆచరణలో పెట్టాడు.