విద్యార్థులు ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు ఇరాన్ ప్రభుత్వం వారిపై విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం ఆహారం తిన్న తర్వాత దాదాపు 1,200 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిపై విషప్రయోగం జరిగిందని ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యార్థులు వాంతులు, తీవ్రమైన నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్శిటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విశ్వవిద్యాలయ కెఫెటేరియాల్లో తినకూడదని నిర్ణయించుకొన్నారు. అధికారులు మాత్రం నీటిలో కలుషిత బ్యాక్టిరీయా కారణంగా ఇలా జరుగుతోందని చెబుతున్నారు. తమ గత అనుభవాల దృష్ట్యా ఇది అధికారుల చర్యే అని నమ్ముతున్నారు.
ఇరాన్‌లో దారుణం.. 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం! - hijab protests news in iran
నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేస్తామని ఇరాన్ ప్రకటించినా.. ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 1200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం సంచలనం రేపింది.
చాలా వైద్యశాలలు మూసివేశారు. దీంతో బాధితులు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు డీహైడ్రైషన్ చికిత్సకు అవసరమైన ఔషధాల కొరత ఏర్పడింది. నైతిక పోలీసు విభాగాన్ని తొలగిస్తున్నామని ఇరాన్ ప్రాసిక్యూటర్ జాఫర్ మోంటజెరి ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడం విశేషం. ఆయన మాట అధికారికంగా చెల్లుబాటవుతుందా.. అన్న అంశంపై స్పష్టత లేదు.
అంతర్జాతీయ రాక్ క్లైంబింగ్ పోటీల్లో హిజాబ్ ధరించకుండా పాల్గొన్న ఇరాన్ క్రీడాకారిణిఎల్నాజ్ రెకబీ ఇంటిని అధికారులు ధ్వంసం చేశారు. ఇరాన్‌లో నైతిక పోలీస్ విభాగాన్ని రద్దు చేసిన మర్నాడే ఈ వార్త వెలువడటం గమనార్హం. ఇరానియన్ వైర్ పత్రిక ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. దెబ్బతిన్న ఇంటి చిత్రాలను కూడా ప్రదర్శించింది. ఎల్నాజ్ సాధించిన పతకాలను వీధిలో పడేశారు.