తెలంగాణ

telangana

ETV Bharat / international

100 గంటలు నాన్​స్టాప్ వంట.. మహిళ సాహసానికి గిన్నిస్ రికార్డు బద్దలు - 100 గంటలు వంట నైజీరియా మహిళ

Cooking Guinness record : నాన్​స్టాప్​గా 100 గంటలు వంట చేసి రికార్డు సృష్టించింది ఓ మహిళా చెఫ్. అంతకుముందు భారత మహిళ నెలకొల్పిన రికార్డును ఆమె బద్దలు కొట్టింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం వంటకాలు చేసింది? ఆ వంటకాలను ఏం చేసిందో చూద్దామా?

Cooking Guinness record
Cooking Guinness record

By

Published : May 16, 2023, 2:08 PM IST

Cooking Guinness record : నైజీరియాకు చెందిన మహిళా చెఫ్ నాన్​స్టాప్​ 100 గంటల పాటు వంట చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. భారత చెఫ్ నమోదు చేసిన 87గంటల 45 నిమిషాల రికార్డును బద్దలుకొట్టింది. నైజీరియాకు చెందిన హిల్దా బాసి అనే మహిళ.. గత గురువారం వంట చేయడం ప్రారంభించింది. నాన్​స్టాప్​గా వంద గంటల పాటు ఆమె వంట చేస్తూనే ఉంది. లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.45కు వంద గంటలు పూర్తి చేసుకుంది.

నైజీరియా వాణిజ్య నగరమైన లాగోస్​లోని లెక్కి ప్రాంతంలో బాసి ఈ సాహసం చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వంట చేయడం ప్రారంభించింది. నైజీరియా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసింది. సూప్​లు, టొమాటో రైస్ వంటి అనేక డిష్​లను తయారు చేసింది. ప్రతి గంటకు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంది బాసి. లేదా 12 గంటలు నాన్​స్టాప్ వంట చేసి.. గంట సేపు విశ్రాంతి తీసుకునేది. ఆ గంట సమయంలోనే స్నానం, మెడికల్ చెకప్​లు పూర్తి చేసుకునేది.

వంట చేస్తున్న మహిళా చెఫ్ హిల్దా బాసి
వంట చేస్తున్న మహిళా చెఫ్ హిల్దా బాసి

వంద గంటలు వంట చేసిన హిల్దా బాసి.. ఆ దేశంలో సెన్సేషన్​గా మారింది. రికార్డు కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలను చూసేందుకు వేలాది మంది లెక్కి ప్రాంతానికి తరలివచ్చారు. పాటలు పాడుతూ ఆమెను ప్రోత్సహించారు. వంద గంటలు పూర్తి కాగానే అభినందనలతో బాసిని ముంచెత్తారు. ఆన్​లైన్​లోనూ ఆమె వంటల కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సైతం బాసిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. నైజీరియాకు ఇది గొప్ప రోజు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

హిల్దా బాసిని ప్రోత్సహిస్తున్న స్థానికులు
వంట చేస్తున్న మహిళా చెఫ్ హిల్దా బాసి

రికార్డు కోసం చేస్తున్న ప్రయత్నం గురించి గిన్నిస్ సంస్థకు అప్పటికే సమాచారం ఇచ్చింది హిల్దా బాసి. కుకింగ్ రికార్డుపై స్పందించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ.. బాసి ప్రయత్నం గురించి తమకు అవగాహన ఉందని పేర్కొంది. రికార్డుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. అనంతరం అధికారికంగా రికార్డును ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇదివరకు ఈ రికార్డు భారత్​కు చెందిన లతా ఠాండన్ అనే మహిళ పేరు మీద ఉంది. 2019లో ఆమె 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది.

వంట చేస్తున్న మహిళా చెఫ్ హిల్దా బాసి

కారణం ఇదే!
ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ వంటల కార్యక్రమాన్ని చేపట్టింది బాసి. తద్వారా నైజీరియా యువత సంకల్పం ఎలాంటిదో చాటి చెప్పాలని అనుకున్నట్లు పేర్కొంది. ఆఫ్రికా సమాజంలో సరైన ప్రాధాన్యం పొందలేకపోతున్న మహిళలకు సంఘీభావంగా ఈ పని చేసినట్లు వివరించింది. తన ప్రయత్నం ద్వారా నైజీరియా వంటల గురించి ప్రపంచం తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అంతసేపు చేసిన వంటలను ఆమె ఏం చేసిందనే అనుమానం మీకు వచ్చిందా? ఆ వంటలన్నీ అక్కడికి వచ్చినవారికి ఫ్రీగా ఇచ్చేసింది.

ABOUT THE AUTHOR

...view details