తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 30వేలు దాటిన మరణాలు - France reports 319 more virus deaths, PM warns 'battle only starting'

ప్రపంచంపై కొవిడ్-19 విశ్వరూపం చూపుతోంది. ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 30 వేలు దాటింది. అత్యధికంగా ఐరోపాలో 21 వేలకు పైగా మంది మృతి చెందారు. ఇందులో 10 వేల మరణాలు ఇటలీలోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య ఆరున్నర లక్షలు దాటింది.

coronavirus death toll 30 thousand
కరోనా మరణ మృదంగం

By

Published : Mar 29, 2020, 5:23 AM IST

ప్రపంచంపై రాకాసి కరోనా దాడి కొనసాగుతోంది. మృతుల సంఖ్య రోజుకో మైలురాయిని చేరుతోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 30 వేలు దాటింది. ఇందులో మూడో వంతు మరణాలు ఐరోపాలోనే సంభవించడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాకు 30,449 మంది బలి కాగా.. ఐరోపాలోనే 21 వేలకు పైగా మృతి చెందారు. ఇందులో దాదాపు సగం(10,023) మరణాలు ఇటలీలోనే సంభవించాయి.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. ఇప్పటివరకు 6,58,205 మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో 1,41,419 మంది కోలుకున్నారు.

'అగ్ర'రాజ్యం

ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన అమెరికాలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 453 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ కారణంగా మొత్తం 1,997 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో 1,20,204 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా న్యూయార్క్​లో(50 వేలకు పైగా) నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫ్రాన్స్​లో 319 మంది

ఫ్రాన్స్​లో వైరస్ కారణంగా మరో 319 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 2,314కి చేరింది. ఈ నేపథ్యంలో వైరస్​పై ఫ్రాన్స్​ చేస్తున్న యుద్ధం తొలి స్టేజీలోనే ఉందని ఆ దేశ ప్రధానమంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్​ నెల తొలి రెండు వారాల్లో పరిస్థితి మరింత కఠినతరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఫ్రాన్స్​ తప్పుడు లెక్కలు!

ప్రభుత్వ అధికార గణాంకాలతో పోలిస్తే మృతులు, వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్రాన్స్​లో ఇప్పటివరకు 37,575 మందికి కరోనా సోకినట్లు నిర్ధరించగా.. ప్రస్తుతం 17,620 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 4,273 మందికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తులను మాత్రమే మృతులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు అధికారులు. రిటైర్​మెంట్​ గృహాలు, ఇళ్లలో సంభవించిన మరణాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. మరోవైపు తీవ్రమైన లక్షణాలు కనబర్చినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక లెక్కలతో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రాన్స్​లో వైద్య సహాయకులకు మాస్కుల కొరత కారణంగా ప్రభుత్వంపై అధిక ఒత్తిడి నెలకొంది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారానికి కేవలం 8 మిలియన్ల మాస్కులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఫ్రాన్స్​కు ఉండగా.. అదనపు సాయం కోసం చైనా సహా వివిధ దేశాల నుంచి 100 కోట్లకు పైగా మాస్కులను దిగుమతి చేసుకుంటోంది.

టర్కీలో వంద మంది మృతి

టర్కీలో కొవిడ్-19 ధాటికి శనివారం 16 మంది మరణించారు. వీరితో కలిపి ఆ దేశంలో కరోనా మరణాలు 108కి చేరుకున్నాయి. కొత్తగా 1,704 కేసులు నమోదు కాగా... మొత్తం 7,402 మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది టర్కీ ప్రభుత్వం. అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణాలు చేసేవారికి సైతం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

స్పెయిన్​ కట్టడి చర్యలు

ఐరోపాలోని మరో దేశం స్పెయిన్​లో కరోనా రక్కసి ప్రబలుతోంది. ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు ఈ దేశంలోనే సంభవిస్తున్నాయి. శనివారం 682 మంది మరణించగా.. ఇప్పటివరకు 5,820 మంది వైరస్​ తీవ్రతకు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అత్యవసరమైన కార్యకలాపాలు మినహా అన్ని ఆర్థిక సర్వీసులను రెండువారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సింగపూర్​లో ఇద్దరు భారతీయులకు కరోనా

సింగపూర్​లో కొత్తగా 70 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 802కు చేరింది. తాజాగా నమోదైన 70 కేసుల్లో 41 మంది ఇటీవలే ఐరోపా సహా కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశాలవారీగా కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details