Worlds Most Prolific Sperm Donor: ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కోరుకుంటున్నారు. ఐదారుగురు పిల్లలు ఉన్నవారినీ చూశాం. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటారా.. వీర్యం దానం చేయడం ద్వారా. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదు. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (వయసు 66 సంవత్సరాలు) వీర్యదానం చేయడం ద్వారా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిది మంది త్వరలో పుట్టబోతున్నారు.
తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీర్యం దానం చేస్తున్నట్టు తెలిపాడు. స్పెర్మ్ ఇచ్చేందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువమందికి వీర్యదానం చేసిన వ్యక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని క్లైవ్ పేర్కొన్నాడు.
అయితే, క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్‌లో స్పెర్మ్ డోనర్ గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా ఫేస్‌బుక్ ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయి ఉచితంగా వీర్యదానం చేస్తున్నాడు. బ్రిటన్‌లో చాలా క్లినిక్‌లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ చెబుతున్నాడు.