కరోనా ఏ మాత్రం శాంతించడం లేదు. వైరస్ ప్రతాపానికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కేసులు, మరణాలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. మరో లక్షా 84 వేలకుపైగా బలయ్యారు. అయితే.. 7 లక్షల 17 వేల మందికిపైగా కోలుకోవడం ఊరట కలిగించే అంశం.
అమెరికాలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నా.. స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. యూకేలో మరణాల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే 1738 మంది చనిపోయారు.
25 వేలు ప్లస్...
ఐరోపా దేశాల్లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న ఇటలీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25 వేలను అధిగమించింది. బుధవారం మరో 437 మంది మరణించారు. కొత్తగా 3370 కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 87 వేల 300 దాటింది.
ఫ్రాన్స్...
ఫ్రాన్స్‌లో శనివారం 544 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 21 వేల 340కి చేరింది. మరో 18 వందల మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య దాదాపు లక్షా 60వేలుగా ఉంది.
మళ్లీ పెరుగుదల..
గత రెండు రోజుల నుంచి స్పెయిన్‌లో కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో మరో 435 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం 21,717మంది మరణించారు. ఇప్పటివరకు 2 లక్షల 8వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కేసుల వివరాలు బ్రిటన్..
యూకేలో రోజూ 700కుపైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ మరో 763 మంది మరణించారు. అయితే.. క్రితం రోజు(823)తో పోలిస్తే ఇది కాస్త తక్కువ. మొత్తం మృతుల సంఖ్య 18 వేల 100కు చేరుకుంది. మరో 4,451 మంది కొవిడ్ బారినపడగా.. దేశంలో బాధితుల సంఖ్య లక్షా 33 వేలుగా ఉంది.
ఇమ్రాన్‌కు నెగటివ్...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. ఇమ్రాన్ రిపోర్టుపై సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫిర్దోస్ అవాన్. ప్రధాని కుటుంబానికి కూడా టెస్టులు చేయగా.. కరోనా నిర్ధరణ కాలేదని వెల్లడించారు.
దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం వరకు 10 వేల 76 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పాక్‌లో 212 మంది బలయ్యారు.
మిగతా దేశాల్లో...
మరో 94 మరణాలతో ఇరాన్లో మొత్తం కరోనా మృతులు 5391కు చేరుకున్నారు. టర్కీలో మరో 117 మంది మరణించారు. కేసుల సంఖ్య లక్షకు చేరువైంది.
సింగపూర్‌లోనూ కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. మొత్తం బాధితుల సంఖ్య 10 వేలు దాటగా.. ఇందులో ఎక్కువ మంది విదేశీయులే ఉండటం గమనార్హం. దేశంలో 12 మంది మరణించారు. శనివారం నమోదైన 1016 కొత్త కేసుల్లో భారతీయులు సహా ఇతర దేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
బెల్జియంలో బుధవారం ఒక్కరోజే 264, నెదర్లాండ్స్‌లో 138, కెనడాలో 132, స్వీడన్లో 172 మంది ప్రాణాలు విడిచారు. ఈ దేశాల్లో కేసుల సంఖ్యా ఆందోళనకరంగా ఉంది. జర్మనీలో 164 మంది మరణించారు. కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. అయితే.. ఇక్కడ దాదాపు లక్ష మంది కోలుకోవడం విశేషం.