కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సురక్షితమని, సమర్థవంతమైందని నిరూపితమయ్యే వరకు ఏ వ్యాక్సిన్ను సిఫారసు చేయమని స్పష్టం చేసింది. రష్యా, చైనా దేశాలు తమ వ్యాక్సిన్ ప్రయోగాత్మక వినియోగాన్ని ప్రారంభించటం, పలు దేశాలు టీకా అనుమతుల కోసం తమ చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ మేరకు వెల్లడించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్.
" సమర్థవంతం, సురక్షితం కాని వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించదని ప్రజలకు భరోసా ఇస్తున్నా. సొంత పరిశోధన ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యాక్సిన్ను ప్రజలు తిరస్కరించాలి. వ్యాక్సిన్ల విషయంలో ప్రజలు అయోమయంలో పడకూడదు."
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ అధినేత.