పోర్చుగల్‌కు చెందిన ఓ మహిళ శరీరంలో వింత వ్యాధి తలెత్తింది. పాలిమేస్టియా అనే వ్యాధతో బాధపడుతున్న ఆమెకు కుడి భుజం కింది భాగం నుంచి చనుబాలు బయటకు వస్తున్నాయి. ఆ మహిళ శరీరంలో భుజం కింది భాగంలో రొమ్ము కణాలు అభివృద్ధి చెందడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆమె వయసు 26 కాగా.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చంకలో నుంచి తల్లిపాలు బయటకు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ తన సంచికలో ప్రచురించింది.
ఇలా వెలుగులోకి..
పోర్చుగల్ మహిళకు బిడ్డ పుట్టిన రెండు రోజుల తర్వాత కుడి భుజం కింది భాగంలో నొప్పి తలెత్తింది. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి ఆ మహిళ తీసుకెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించగా.. చంకలో అధిక కణజాలాన్ని గుర్తించారు. దానిపై నొక్కి చూస్తే.. శ్వేతవర్ణంలో ద్రవం బయటకు రావడాన్ని గమనించారు. చివరకు రొమ్ము పాలే చంకలో నుంచి బయటకు వస్తున్నాయని స్పష్టతకు వచ్చారు. పాలిమేస్టియా వ్యాధితోనే మహిళ బాధపడుతోందని లిస్బన్లోని సాంటా మారియా ఆస్పత్రి వైద్యులు నిర్ధరణకు వచ్చారు.