అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. దాని ధర కూడా అందనంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఏడాదికి పైగా గడిపిన ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37కోట్లు) పలకొచ్చని భావిస్తోంది.
ఈ సీసా పేరు 'పెట్రస్ 2000'. 2019నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్ సీసాల్లో ఇదొకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ 'స్పేస్ కార్గో అన్లిమిటెడ్' వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది.
వీటికి ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న 'ఇన్స్టిట్యూట్ ఫర్ వైన్ అండన్ వైన్ రీసెర్చ్'లో పరిశోధకులు రుచి పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని చెప్పారు. రోదసిలోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందన్నారు. శూన్య గురుత్వాకర్షణ కూడిన ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్ పరిపక్వానికి వచ్చిందని క్రిస్టీస్ వైన్ అండన్ స్పిరిట్స్ విభాగం డైరెక్టర్ టిమ్ ట్రిప్ట్రీ చెప్పారు. దీంతో ఈ సీసా ధర పెరిగిపోయిందని తెలిపారు.
ఇదీ చదవండి:భారత్‌తో బ్రిటన్ భారీ వాణిజ్య ఒప్పందం