ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిపుణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 100 శాతం సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్ కనీసం 2021 నాటికైనా వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడం సహా వైరస్ కట్టడికి పాటించాల్సిన నియమాల్ని కఠినంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
'జీవనశైలిలో మార్పులు తప్పవు'
ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై ఫ్రాన్స్ ప్రభుత్వానికి సలహాలందిస్తున్న శాస్త్రవేత్తల బృందంలో కీలక సభ్యుడైన ఆర్నాడ్ మన అలవాట్లు, జీవనశైలిలో మార్పులు తప్పవన్నారు.
'వ్యాక్సిన్ తయారీ సంవత్సరాల ప్రక్రియ. అయితే, కరోనాపై పోరాడే టీకా కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, 2021 నాటికి ప్రభావవంతమైన వ్యాక్సిన్ వస్తే అది ఆశ్చర్యమనే చెప్పాలి. పాక్షికంగా పనిచేసే టీకా రావొచ్చు. ఈ సంక్షోభం అంతానికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. మరోసారి లాక్‌డౌన్ అంటే కష్టమే. మన అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిందే.'