తెలంగాణ

telangana

ETV Bharat / international

అసాంజే: పారదర్శకతకు ప్రతీకా? రాజద్రోహా?

జులియన్​ అసాంజే... వికీలీక్స్​ వ్యవస్థాపకుడు. దాదాపు పదేళ్ల క్రితం ఆయనొక సంచలనం. పారదర్శకతకు, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతీక. ఆ తర్వాత ఎన్నో వివాదాలు, ఆయన జీవితంలో మరెన్నో మలుపులు. ఎందుకు ఇదంతా? అసాంజే ఏం చేశారు?

అసాంజే

By

Published : Apr 11, 2019, 7:04 PM IST

ఏడేళ్లుగా లండన్​లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను బ్రిటన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్వెడార్​ రాజకీయ ఆశ్రయాన్ని విరమించుకున్న వెంటనే పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు.

అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించిన కీలక సమాచారాన్ని బహిర్గతం చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది వికీలీక్స్. ​​

7లక్షల70 వేల పత్రాలు బహిర్గతం

2010: జూన్​-అక్టోబరు మధ్యకాలంలో అగ్రరాజ్యం అమెరికా దౌత్యవిధానాలకు సంబంధించిన 7లక్షల 70వేల రహస్య పత్రాలను వికీలీక్స్​ బహిర్గతం చేసింది. ఇందులో అఫ్గానిస్థాన్, ఇరాక్​లతో యుద్ధ వివరాలూ ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే అమెరికా దౌత్య కార్యకలాపాలకు సంబంధించి మరో 2లక్షల 50వేల పత్రాలనూ విడుదల చేసి సంచలనం సృష్టించింది వికీలీక్స్​.

ఆ మరుసటి నెలలోనే ఇద్దరు స్వీడన్ మహిళలను లైంగికంగా వేధించారని అసాంజేపై అరెస్టు వారెంటు జారీ చేశారు స్వీడన్ న్యాయవాది. ఈ ఆరోపణలను ఆసాంజే ఖండించారు. వేధింపులకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.

2010 డిసెంబరు: లండన్​ పోలీసుల ఎదుట లొంగిపోయారు అసాంజే. ఆ తర్వాత బెయిల్​పై విడుదలయ్యారు. తనపై బురద జల్లేందుకే స్వీడన్ తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు అసాంజే.

2011: అసాంజేను స్వీడన్​కు అప్పగించాలని లండన్ కోర్టు అదేశించింది. స్వీడన్​ తనను అమెరికాకు అప్పగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు అసాంజే. అమెరికా సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఆ దేశం కఠిన శిక్షలు విధిస్తుందని అసాంజేకు తెలుసు.

2012 జూన్: లండన్​లోని ఈక్వెడార్​ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందారు అసాంజే. అక్కడే తలదాచుకుంటానన్న అసాంజే అభ్యర్థనను ఈక్వెడార్ అంగీకరించింది.

2018 జనవరి: అసాంజే సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు కావాలని ఈక్వెడార్ అడిగింది.

2018 ఫిబ్రవరి: ఆరోగ్య కారణాల దృష్ట్యా తనపై ఉన్న అరెస్టు వారెంటును రద్దు చేయాలన్న అసాంజే అభ్యర్థనను బ్రిటన్ అంగీకరించలేదు.

ఇతర దేశాల విషయాల్లో తలదూర్చొద్దన్న ఒప్పందాన్ని అతిక్రమించినందుకు 2018 మార్చిలో అసాంజేతో సంబంధాలు కొనసాగించొద్దని ఈక్వెడార్ నిర్ణయం తీసుకుంది.

2018 అక్టోబరు: దౌత్య కార్యాలయంలో ఉంటున్న అసాంజేపై కొత్త ఆంక్షలు విధించింది ఈక్వెడార్. వాటిని పాటించకపోతే ఆశ్రయాన్ని విరమించుకుంటామని హెచ్చరించింది.

2018 నవంబరు: అమెరికా న్యాయవాదులు అసాంజేపై రహస్యంగా మోపిన నేరాభియోగాల వివరాలు పొరబాటున బహిర్గతమయ్యాయి.

దౌత్య కార్యాలయంలో నిబంధనలను అసాంజే తరచూ అతిక్రమిస్తున్నారని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్​ మొరెనో ఈ నెల మొదట్లో తెలిపారు. అసాంజే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని నిర్ధరించేందుకు ఈ నెల​ 25న దౌత్య కార్యాలయంలో ప్రత్యేక నిపుణులు విచారణ జరపాల్సి ఉంది.

దర్యాప్తు జరగక ముందే నేడు (ఏప్రిల్​ 11న)​ అసాంజేకు ఆశ్రయం కల్పించడం విరమించుకుంటున్నామని దౌత్య కార్యాలయం ప్రకటన చేసింది. వెంటనే బ్రిటిష్​ పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:బ్రెగ్జిట్​ వాయిదా... అక్టోబర్​ 31వరకు గడువు

ABOUT THE AUTHOR

...view details