తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇటలీకి ఏమైంది? కరోనాతో ఎందుకింత ప్రాణనష్టం? - Case of coronavirus in italy

సంపన్న, అభివృద్ధి చెందిన దేశం... జనాభా చాలా తక్కువ... అయినా ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. కరోనాకు కేంద్రబిందువైన చైనాకన్నా అధికంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎందుకిలా? ఇటలీకి ఏమైంది?

Why Italy? The factors behind a coronavirus disaster
ఇటలీకి ఏమైంది? కరోనాతో ఎందుకింత ప్రాణనష్టం?

By

Published : Mar 22, 2020, 3:30 PM IST

కరోనా మహమ్మారి ధాటికి ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. 7.7 బిలియన్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు 13 వేల మందికిపైగా కరోనా ధాటికి మృత్యువాత పడ్డారు. ఇందులో మూడో వంతు మంది కేవలం 60 మిలియన్ల జనాభా ఉన్న ఇటలీ దేశస్థులే కావడం గమనార్హం.

ఓ పక్క చైనా, దక్షిణ కొరియాలు కరోనా పిశాచి మెడలు వంచి పాదాల కింద తొక్కిపెడుతూ ఉంటే... ఆర్థికంగా సంపన్నమైన ఇటలీ మాత్రం ఇంతలా ఎందుకు నష్టపోతోందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

అప్రమత్తం కావాలి...

ఇటలీ ఇంతలా నష్టపోవడానికి గల ప్రతి కారణాన్ని ప్రపంచ దేశాలు తక్షణం విశ్లేషించాల్సి ఉంది. ఆయా దేశాలు మరో ఇటలీలా మారకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి.

వృద్ధ జనాభానే కారణమా?

ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇటాలియన్​ల సగటు వయస్సు కాస్త ఎక్కువ. దీనికి తోడు ఆధునిక కాలానికి తగ్గట్టుగా అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు.

శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇటలీలో కరోనా మరణాల రేటు 8.6 శాతం. మృతుల్లో వయస్సు మళ్లిన వారే అధికం. వీరి సగటు వయస్సు 78.5 సంవత్సరాలు. వీరిలో సగం మంది కరోనా సోకక ముందు కనీసం ఒక్క రోగంతోనైనా బాధపడుతున్నారు.

"కరోనా ధాటికి వృద్ధులే అధికంగా ప్రభావితమవుతున్నారు. మరణిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రపంచ దేశాలు తమ తమ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దూకుడుగా రక్షణ చర్యలు తీసుకోవాలి."

- జెన్నిఫర్​ డౌడ్​, ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు

అధికారిక గణాంకాల ప్రకారం... గతేడాది ఇటలీ జనాభా సగటు వయస్సు 45.4 సంవత్సరాలు. ఐరోపాలోని మరే ఇతర దేశంతో పోల్చినా ఇది చాలా ఎక్కువ. చైనాతో పోల్చితే ఏడు సంవత్సరాలు అధికం.

జపాన్​ జనాభా సగటు వయస్సు 47.3 సంవత్సరాలు. ఇది ఇటలీ సగటు వయస్సు కంటే చాలా ఎక్కువ. కానీ.. జపాన్​లో కరోనా మృతుల సంఖ్య 35 మాత్రమే. దీనిని విశ్లేషించి చూస్తే... 'వృద్ధాప్యం (వయస్సు)' ఒక్కటే ఇంత వైపరీత్యానికి కారణం కాదని స్పష్టం అవుతోంది.

మరైతే ఈ విపత్తు కారణమేంటి?

"కరోనాతో ఇటలీ ఎందుకు విలవిలలాడుతోంది? దీనికి ఓ సులువైన సమాధానం ఉంది. అదేంటి అంటే... దీనికి కారణం లేదు."

- యాస్చ మౌంక్​, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ

నిర్లక్ష్యమే కారణమా?

నిజానికి జర్మనీ, అమెరికా లేదా కెనడాకు కరోనా వ్యాపించడానికి పది రోజుల ముందే ఇటలీలో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మాత్రం చేయిదాటిపోయింది. ఇప్పటి వరకు ఇటలీలో 4000 మందికి పైగా కరోనాతో మరణించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనడానికి ఆస్కారం లేదు.

ఆసుపత్రులన్నీ నిండిపోతే...

ప్రస్తుతం ఇటలీని కలవరపెడుతున్న విషయం... ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతే ఏమి చేయాలన్నదే. ఇదే జరిగితే ఈ అంటువ్యాధి మరింతగా వ్యాపించే అవకాశం ఉంది.

"కొంత మంది రోగులకు చికిత్స చేసినా ఫలితం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు.. వారిని పక్కన పెట్టి, కోలుకోవడానికి అవకాశమున్న రోగులకు మాత్రమే చికిత్స చేయగలుగుతారు. తప్పని పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు."

- పాలో టెర్రాగ్నోలి, బ్రెస్సియా ఆసుపత్రి ఎమర్జెన్సీ యూనిట్ హెడ్​

పొంచి ఉన్న భయం..

ప్రస్తుతం ఇటలీ ఉత్తర భాగంలో మాత్రమే కరోనా విజృంభిస్తోంది. ఇదే కనుక పేదలున్న, సరైన వైద్య సదుపాయాలు లేని దక్షిణ ఇటలీకి పాకితే భారీ నష్టం తప్పదు. ఇదే ఇప్పుడు ఇటలీని తీవ్రంగా కలవర పెడుతోంది.

ఇటలీ బాటలో స్పెయిన్, ఫ్రాన్స్​

ప్రస్తుతానికి ఇటలీ తరువాత అంతగా నష్టపోయిన దేశాలు స్పెయిన్, ఫ్రాన్స్​. మరికొన్ని వారాల్లో అక్కడ కూడా మరణాలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

"ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సరైనా చర్యలు తీసుకోకపోతే, అవి కూడా మరో ఇటలీలా మారే అవకాశం ఉంది."

- యాస్చ మౌంక్​, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ

పరీక్ష సాధనాలు లేవ్​

వైరస్​ను గుర్తించేందుకు తగిన సంఖ్యలో పరీక్ష సాధనాలు ( టెస్ట్ కిట్స్​) లేకపోవడం మరో ప్రధాన సమస్య. ఈ ఇబ్బంది ఇటలీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఉంది.

ఇటలీలో ఇప్పటి వరకు దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం టెస్ట్ కిట్స్ కొరతే. దక్షిణ కొరియాలో రోజుకు 10,000 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జర్మనీ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. దీనితో అక్కడ క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

దీనిని విశ్లేషిస్తే, దక్షిణ కొరియా, జర్మనీల్లో ఎందుకు కరోనా అదుపులోకి వస్తోందో, ఇటలీలో ఎందుకు ఇంకా విజృంభిస్తుందో పాక్షికంగా మనకు అర్థమవుతుంది.

ఇదీ చూడండి:కరోనాపై పోరులో దక్షిణ కొరియా నేర్పే పాఠాలెన్నో...

ఇదీ చూడండి:కరోనాకు ఆరోగ్య బీమా వర్తిస్తుందా? పాలసీ​ ఎలా ఉండాలి?

ABOUT THE AUTHOR

...view details