కరోనా మహమ్మారి వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని సూచిస్తోంది బ్రిటీష్ సైకాలజీ సొసైటీ. నిత్యం వ్యాయామం చేస్తూ, కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలని తెలిపింది. స్వీయ నిర్బంధంలో ఉన్నామని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం బ్రిటన్ మొత్తం లాక్డౌన్లో ఉంది. ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని ప్రజలకు సూచిస్తోంది బ్రిటీష్ సైకాలజీ సొసైటీ. ఒకే ఇంటికి చెందని ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట ఉండొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ల కూడదని ఆదేశించింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని పలు వ్యాయామ శిక్షకులు సూచిస్తున్నారు.
" సాధారణంగా తక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. వారి స్థాయిని బట్టి వ్యాయామం చేయాలి. ఏవైనా గాయాలు అయినవారు, వృద్ధులు పది సార్లు సోఫాలో కూర్చొని లేవడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలాంటి సులభమైనవి చేయాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచేందుకు అవకాశం ఉంటుంది. చేతులు, కాళ్లు పైకి కిందకి ఊపడం, జాగింగ్, వాకింగ్ వంటివి చేయాలి."