కరోనా వైరస్ను అంతమొందించే టీకా వచ్చిందని సంతోషపడ్డాం. చాలా దేశాలలో టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మనకేం కాదు.. కరోనా బారి నుంచి మనం బయటపడ్డట్టే! అని అనుకునే లోపే.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వాక్సిన్ల పనితీరుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిందని, ఆ కారణంగా ఒక వ్యక్తి మరణించాడని డెన్మార్క్ ఆరోపిస్తోంది. అస్ట్రాజెనెకా టీకా పంపిణీ తమ దేశంలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు ఇదే కారణంతో ఐర్లాండ్,నెదర్లాండ్, థాయిలాండ్, నార్వే, ఐస్లాండ్, బల్గేరియా, కాంగో దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేశాయి.
అయితే ఆ టీకా వల్లే రక్తం గడ్డకట్టి లేదా రక్తకణాలు తగ్గి వ్యక్తులు చనిపోతున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ చెబుతున్నాయి. అంతేకాకుండా వాక్సిన్ వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. మరి ఎవరి వాదన నిజం? ఆస్ట్రాజెనెకా వల్ల నష్టాలెవైనా ఉన్నాయా? లేవా? టీకా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరెవరు టీకా తీసుకోకూడదూ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
ఏం జరిగింది?
ఆస్ట్రాజెనెకా టీకా పంపణీని నిలిపివేసిన మొట్టమొదటి దేశం డెన్మార్క్. ఈ టీకా తీసుకున్న కొందరిలో వారం తర్వాత రక్తం గడ్డకట్టడం సమస్య తలెత్తింది. టీకా తీసుకున్న పదిరోజుల తర్వాత రక్తం గడ్డకట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. దాంతో ఆస్ట్రాజెనెకాపై నిషేధం విధించామని ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొంది. రక్తం గడ్డకట్టడానికి ఆస్ట్రాజెనెకా టీకానే కారణమని ఇప్పుడే నిర్ధరణకు రాలేమని వెల్లడించింది.
రక్తకణలల తగ్గుదల!
ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న(50ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు)కొందరిలో రక్తకణాల సంఖ్య తగ్గినట్లు నార్వే ప్రభుత్వం తెలిపింది. దాంతో వారికి తీవ్ర రక్తస్రావం అయినట్లు పేర్కొంది. వెంటనే టీకా పంపిణీని నిలిపివేసింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నెదర్లాండ్తో పాటు థాయిలాండ్, ఐస్లాండ్ తదితర దేశాలూ అస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి.
"ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా టీకా వల్ల వచ్చిన దుష్ఫలితాలను చూసి మా దేశంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ టీకా పంపిణీని నిలిపివేశాం"
-హ్యూగో డీ జోంగ్, నెదర్లాండ్ ఆరోగ్యమంత్రి.
ఈ వ్యవహారంపై ఆస్ట్రాజెనెకా సంస్థ స్పందించింది.
"యూరోప్ అంతటా అస్ట్రాజెనెకా టీకా తీసుకున్న దాదాపు 17మిలియన్ల మంది డేటాను పరిశీలిస్తున్నాం. అయితే అస్ట్రాజెనెకా టీకా వల్లే రక్తం గడ్డకట్టం, రక్త కణాలు తగ్గడం వంటి సమస్యలు తెలిత్తినట్లు ఎలాంటి ఆధారాలు లేవు."
-ఆస్ట్రాజెనెకా సంస్థ
ఇదీ చదవండి:'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్'
ది యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ఇదే సమాధానం చెప్పింది. వాక్సిన్ తీసుకోని వారిలో రక్తం గడ్డకట్టడాన్ని పోల్చితే టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం దాదాపు సమానంగా ఉందని తెలిపింది.
బ్రిటన్లో అస్ట్రాజెనెకా టీకాను 11మిలియన్ల మంది తీసుకున్నారు. అందులో 11మందిలో మాత్రమే రక్తం గడ్డకట్టడం వంటి సమస్య ఎదురైంది. అయితే ఆ టీకా వల్లే ఇలా జరిగిందనడానికి ఆధారాలు లేవు.
ఆస్ట్రాజెనెకా టీకా ఆయా దేశాలు ఎందుకు నిలిపివేసినట్టు?