తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ దేశాల్లో రెండోసారి కరోనా తీవ్రత తప్పదు' - COVID-19

లాక్​డౌన్​ ఆంక్షలతో కరోనాను అరికట్టిన దేశాలు...ఆ నిబంధనలను వెంటనే సడలిస్తే వైరస్​ తీవ్రత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించంది. ఆర్థికంగా పెను ప్రభావం పడుతుండటం వల్ల కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పలు దేశాలు దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ సూచనలు చేసింది.

WHO warns of 'second peak' in areas where COVID-19 declining
'ఆ దేశాల్లో రెండోసారి కరోనా తీవ్రత తప్పదు'

By

Published : May 26, 2020, 2:57 PM IST

కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్‌ను అరికట్టిన దేశాలు ఇప్పుడు ఆ నిబంధనలను వెంటనే సడలిస్తే.. తక్షణమే రెండోసారి వైరస్ తారస్థాయిని చవిచూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచం ఇంకా వైరస్‌ మొదటి దశకు మధ్యలోనే ఉందని ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వెల్లడించారు. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంటువ్యాధులు దశల వారీగా దాడి చేస్తాయని, మొదటి దశ తీవ్రత కొద్దిగా తగ్గిన దేశాల్లో సంవత్సరాంతంలో మళ్లీ దాని ప్రభావం కనిపిస్తుందన్నారు. మొదటి దశ కట్టడికి తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేస్తే మరోసారి వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

"మరోసారి ఎప్పుడైనా ఆ వైరస్‌ దాడి చేయొచ్చనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు వైరస్ తగ్గుతుందని.. మరోసారి రావడానికి నెలల పాటు సమయం ఉంటుందని మనం అంచనా వేయలేం. ఈ దశలోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదు కావొచ్చు"

- డాక్టర్‌ మైక్‌ ర్యాన్,డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగాధిపతి

తక్షణమే రెండోసారి వైరస్‌ తారస్థాయికి చేరదని హామీ ఇవ్వడానికి ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు ప్రజారోగ్యం, నిఘా చర్యలు, పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను కొనసాగించాలని సూచించారు. ఆర్థికంగా పెను ప్రభావం పడుతుండటం వల్ల కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఆ దేశాలు దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో మైక్​ ఈ సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details