WHO warning Omicron: ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్‌తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని హెచ్చరించింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఉమ్మడి ముప్పుగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు ఒకేసారి వ్యాప్తి చెందుతుండటం వల్ల.. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపింది.
Covid cases Tsunami
ఆస్పత్రి చేరికలు, మరణాలు సైతం అధికంగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. ఉమ్మడిగా దీన్ని ఎదుర్కోకపోతే.. వైరస్ మరింతగా వ్యాపించి వైద్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు.
"వైద్య వ్యవస్థపై ఒత్తిడికి పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చేరడం మాత్రమే కారణం కాదు. హెల్త్ వర్కర్లు చాలా మంది వైద్యం చేస్తూ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. మరణించే ముప్పు వారిలోనే అధికంగా ఉంటోంది."
-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
2022లో కరోనా తీవ్ర దశ నుంచి ప్రపంచం బయటపడే అవకాశం ఉందని ఇదివరకు అంచనా వేసిన డబ్ల్యూహెచ్ఓ... ఇందుకు టీకా సమానత్వం సాధించాలని అభిప్రాయపడింది. ప్రతి దేశంలో వ్యాక్సినేషన్ రేటు 2021 చివరి నాటికి జనాభాలో 40 శాతం, 2022 జూన్ నాటికి 70శాతం పూర్తి కావాలని నిర్దేశించుకుంది. అయితే, 194 దేశాల్లో 92 సభ్య దేశాలు 40 శాతం టార్గెట్‌కు దూరంగా ఉండిపోయాయని టెడ్రోస్ తాజాగా వెల్లడించారు. ధనిక దేశాల తీరుతో...పేద దేశాలకు టీకాలు, వైద్య పరికరాలు అందకుండా పోయాయని అన్నారు. 2022లోనైనా 70శాతం టార్గెట్‌ను అందుకునేలా నూతన సంవత్సరంలో తీర్మానించుకోవాలని పిలుపునిచ్చారు.