ఆస్ట్రాజెనెకా టీకాపై వ్యక్తమవుతున్న అనుమానాలు.. పంపిణీపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐరోపాలోని పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా దుష్ప్రభావం చూపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డకడుతోందని ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ సమస్య ఐరోపా ఉత్పత్తి కేంద్రాల లోపం కారణంగా ఏర్పడిందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
"మేము ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలము. కానీ ఐరోపా ఉత్పత్తి కేంద్రాల్లో తయారైన టీకాలు మాత్రమే దుష్ఫలితాలు ఇస్తున్నాయి. కొవాక్స్ కార్యక్రమం కింద మేము పంపిణీ చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి సమస్య తలెత్తలేదు. భారత్, దక్షిణ కొరియాలో తయారు చేసిన ఈ టీకాలను మేము వివిధ దేశాలకు అందిస్తున్నాము. పలు దేశాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు టీకా పంపిణీపై ఎలాంటి ప్రభావం చూపలేదు."
-మేరీ ఏంజెలా సిమో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అదనపు డైరెక్టర్