మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురిలో ఒక మహిళ తమ జీవిత కాలంలో భౌతిక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని తేలింది.
యువతులుగా ఉన్నప్పుడే చాలా మంది మహిళలు హింస బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. రిలేషన్షిప్లో ఉన్న మహిళలు 20 ఏళ్ల లోపే తమ భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొన్నారని తెలిపింది. మహిళా సన్నిహితులు, అపరిచితుల నుంచి ఎదురైన హింసాత్మక ఘటనలను పరిగణనలోకి తీసుకొని నివేదిక రూపొందించింది. 15 ఏళ్లు పైబడిన యువతులు, మహిళల్లో 73.6 కోట్ల మంది హింస బారిన పడ్డారని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం ముగ్గురిలో ఒకరు భాగస్వామి లేదా అపరిచితుల నుంచి హింసను ఎదుర్కొన్నారని తెలిపింది.
"ప్రతి దేశం, ప్రతి సంస్కృతిలో మహిళల పట్ల హింస అంతంకాని మహమ్మారిలా మారిపోయింది. లక్షలాది మహిళలు, వారి కుటుంబాలకు ఇది హాని కలిగిస్తోంది. ఇది కొవిడ్ కారణంగా ఇంకా పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వాలు సహకారం అందించాలి."