తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రాజెనెకా టీకా వాడొచ్చు: డబ్ల్యూహెచ్​ఓ - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఆస్ట్రాజెనెకా టీకా వాడొచ్చని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది. యూరప్‌ దేశాలు టీకా పంపిణీని నిలిపివేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

WHO states that AstraZeneca vaccine is safe
ఆస్ట్రాజెనెకా టీకా వాడొచ్చు: డబ్ల్యూహెచ్​ఓ

By

Published : Mar 13, 2021, 5:26 AM IST

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీని యూరప్‌లో కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఆయా దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేయడానికి ఎటువంటి సహేతుక కారణాలు లేవని వెల్లడించింది. వాక్సిన్‌ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడడానికి వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చిందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టంచేసింది.

'వ్యాక్సినేషన్‌ కారణంగా మరణాలు సంభవించాయని చెప్పే ఎలాంటి రుజువులు ఇప్పటివరకు లభించలేదు. వ్యాక్సిన్‌ల పంపిణీ సమయంలో ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురైనా, వాటిని తప్పకుండా సమీక్షించుకోవాలి. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌ను ఉపయోగించ వద్దనడానికి ఎలాంటి రుజువులు లేవు. అందుకే ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని కొనసాగించాలి' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ స్పష్టంచేశారు. కొన్ని దేశాల్లో సంభవించిన మరణాల సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కూడా అద్భుతంగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొంతమంది రక్తంలో సమస్యలు ఎదురవుతున్నట్లు డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌, ఇటలీ, రోమానియా వంటి దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఆస్ట్రియాలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకొన్న ఓ నర్సుకు కొన్ని రోజుల్లోనే ఆమె రక్తంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆమె కన్నుమూసింది. దీంతో ఈ టీకా వినియోగాన్ని ఆస్ట్రియాలో నిలిపేసింది. ఇక డెన్మార్క్‌లోనూ ఓ ఫిర్యాదు రావడంతో రెండు వారాలపాటు ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే దారిలో నార్వే, ఎస్తోనియా, లత్వియా, లుత్వేనియా, లక్సంబర్గ్‌ దేశాలు కూడా టీకాల్లోని ఓ బ్యాచ్‌కి చెందిన వాటిని వాడటం ఆపేశాయి. ఇలా వరుసగా యూరప్‌ దేశాలు తాత్కాలికంగా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమని మరోసారి ప్రకటన చేసింది.

ఇదీ చదవండి:30 మంది విద్యార్థులను అపహరించిన ఉగ్రవాదులు

ABOUT THE AUTHOR

...view details