WHO on pandemic end: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని, మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు హెచ్చరించించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒమిక్రాన్ వేరియంట్ చివరిదిగా భావించటం లేదా చివరి దశలో ఉన్నామనుకోవటం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని కీలక లక్ష్యాలను చేరుకుంటే ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ దశ ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని అంచనా వేసింది.
డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ ప్రారంభం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్. పొగాకు వినియోగం తగ్గింపు, యాంటీ మైక్రోబయల్ చికిత్సలపై పోరాటం, మనుషుల ఆరోగ్యంపై పర్యావరణ మార్పుల ప్రభావం వంటి కీలక అంశాల్లో సాధించిన విజయాలు, ఆందోళనలను వెల్లడించారు. ప్రస్తుత కొవిడ్ దశకు ముగింపు.. దేశాలు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
"కరోనా మహమ్మారి ప్రస్తుత దశ ముగింపుతో పాటు.. పూర్తిస్థాయిలో తరిమేసేందుకు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఒమిక్రాన్ చివరి వేరియంట్ అని.. లేదా మనం చివరి దశలో ఉన్నామని భావించటం చాలా ప్రమాదకరం. దేశాలవారీగా, అంతర్జాతీయంగా మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గ్లోబల్ ఎమర్జెన్సీగా కొవిడ్-19కు ముగింపు పలకొచ్చు. ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకా అందించటం, అధిక రిస్క్ ఉన్న ప్రజలపై దృష్టి సారించటం, పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం, కొత్త వేరియంట్లు నిశితంగా పరిశీలించటం వంటి డబ్ల్యూహెచ్ఓ లక్ష్యాలను చేరుకోవటం ద్వారా ఈ ఏడాదే చేయొచ్చు."