దేశీయంగా తయారైన కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి (Covaxin WHO Approval) ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ల జాబితాలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్ స్థానం సంపాదించింది.
"టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫార్సును పరిశీలించి కొవాగ్జిన్‌కు (Covaxin WHO Approval) అనుమతులిచ్చాం. కొవిడ్ నుంచి రక్షణ కల్పించడంలో నిర్దేశించిన ప్రమాణాలను కొవాగ్జిన్ అధిగమించిందని నిపుణులు సిఫార్సులో పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైంది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫార్సు తర్వాత మరో నిపుణుల బృందం కూడా ఈ వ్యాక్సిన్ పనితీరును పరిశీలించింది. అయితే ప్రస్తుతం గర్భిణీలకు కొవాగ్జిన్ ఇవ్వడంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం గర్భిణీలకు ఈ వ్యాక్సిన్ సురక్షితం అని చెప్పలేము."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ
కొవాగ్జిన్‌కు ఆమోదం లభించడం ద్వారా టీకాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలుపడుతుందన్నారు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణా ఎల్లా.
"దేశంలో విస్తృతంగా అందజేస్తున్న, సురక్షితమైన, ప్రభావవంతమైన కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతి లభించటం అత్యంత కీలక పరిణామం. టీకా తయారీలో అనుసరించిన నాణ్యమైన, భద్రత పరమైన ప్రమాణాల వల్లే డబ్ల్యూహెచ్ఓ నిర్ధేశించిన శాస్త్రీయ ప్రమాణాలను కొవాగ్జిన్ అధిగమించింది. కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించటం ద్వారా టీకాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలుపడుతుంది."
-కృష్ణా ఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్
కరోనా పరిస్థితుల్లో భారత్ బయోటెక్, తమ భాగస్వాములు చేసిన అద్భుత ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం ఇదని సుచిత్రా ఎల్లా అన్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో తయారైన ప్రపంచ స్థాయి టీకా కొవాగ్జిన్ అన్న ఆమె.. మరింత ప్రభావవంతమైన పనితీరు చూపేందుకు ఇది సదవకాశమని పేర్కొన్నారు. జూన్‌లోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా డబ్ల్యూహెచ్ఓకు అందించామన్న భారత్ బయోటెక్.. జూలైలో ఈయూఎల్ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
కొవాగ్జిన్‌కు అనుమతితో మరో వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చిందన్నారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్.
"డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకాల జాబితాలో మరో కొవాగ్జిన్ చేరడం హర్షనీయం. ఎన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే అంత సమర్థమంతంగా వైరస్‌పై పోరాడవచ్చు."