చైనా ఒత్తిడి మేరకు కరోనా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని తాము తొక్కిపెట్టినట్టు వస్తున్న ఆరోపణల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ జర్మనీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం నిరాధారం, అవాస్తవం అని తెలిపింది. కథనంలో పేర్కొన్నట్లుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మధ్య జనవరి 21న ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని వివరించింది.
"ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని జనవరి 20న చైనా సమాచారం అందించింది. దీన్ని నిర్ధరించుకొని రెండు రోజుల్లో యావత్తు ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌ఓ తెలియజేసింది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రతను కచ్చితంగా అంచనా వేసి ఫిబ్రవరి 11న మహమ్మారిగా ప్రకటించాం." - ప్రపంచ ఆరోగ్య సంస్థ
జర్మనీ వారపత్రిక కథనంతో..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో జాప్యం చేసిందంటూ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ వారపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు అధనోమ్‌తో జిన్‌పింగ్ జరిపిన ఫోన్ సంభాషణ ఆధారాలు జర్మనీ విదేశీ నిఘా సంస్థల వద్ద ఉన్నట్లు పేర్కొంది.