కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు వ్యాఖ్యానించించారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ రేటు పెరగడం వల్ల కొన్ని నెలలుగా కొవిడ్ కేసులు, మరణాలు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో తాజా తిరోగమన పరిస్థితులపై టెడ్రోస్ ఆందోళన వ్యక్తంచేసినట్టు యూన్ న్యూస్ పేర్కొంది. వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్ 111 దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు.
WHO: థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరిక! - టెడ్రోస్ అధనోమ్
కరోనా మూడోదశ త్వరలో తప్పదని చర్చ జరుగుతున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక హెచ్చరిక చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తితోపాటు సామాజిక సంచారం పెరగటం, కొవిడ్ నిబంధనలు పాటించకపోవటం, ఇంకా చాలాదేశాలకు టీకా అందుబాటులోకి రాకపోవటం వంటిని మూడోదశకు కారణమని తేల్చింది.
ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటివరకు ఏ వ్యాక్సినూ అందలేదని, ఇంకా చాలా దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు రాలేదన్నారు. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్ నాటికి కనీసం 10శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాలో 40శాతం మందికి, 2022 మధ్యకాలం నాటికి 70శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. వ్యాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన, సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో ఉంచడంతో పాటు సామూహిక సమావేశాలపై కట్టడిపై సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరంఉందన్నారు. కఠిన నిబంధనలు అమలుచేయడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'డెల్టా వ్యాప్తితో ప్రపంచానికి పెను ముప్పు!'