తెలంగాణ

telangana

'వ్యాక్సిన్‌ పంపిణీలో ఆ విధానమే అనుసరణీయం'

By

Published : Oct 26, 2020, 1:15 PM IST

కొవిడ్‌ నిర్మూలనకు మరింత సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్‌ అథనోమ్​ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్‌ అందజేసేకంటే.. అన్ని దేశాల్లో కొందరి చొప్పున వ్యాక్సిన్‌ అందజేసే విధానం అనుసరణీయమన్నారు. టీకా విషయంలో జాతీయవాదాన్ని పాటించటం తెలివైన చర్య కాదన్నారు. మహమ్మారి నుంచి సంపూర్ణంగా విముక్తి పొందాలంటే కలసి నడవటం ఒకటే మార్గమనని సూచించారు.

Tedros adhanom
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్‌ అథనోమ్​

కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ఏకతాటిపై నడవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. బెర్లిన్‌లో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ ఆరోగ్య సమావేశం (వరల్డ్‌ హెల్త్‌ సమ్మిట్‌) ప్రారంభం సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ అథనోమ్‌ వీడియో మాధ్యమంలో ప్రసంగించారు. కొవిడ్‌-19 టీకా విషయంలో జాతీయవాదాన్ని పాటించటం తెలివైన చర్య కాదన్నారు. ఈ మహమ్మారి నుంచి మానవాళి సంపూర్ణంగా విముక్తి పొందాలంటే కలసి నడవటం ఒకటే మార్గమన్నారు. పేద దేశాలకు కూడా టీకా సక్రమంగా అందినప్పుడే ఇది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

పీడిస్తున్న నిధుల కొరత

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వాటిలో సుమారు పది ప్రయత్నాలు చివరిదైన మూడో దశలో ఉన్నాయి. వేలాది మంది వలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌తో సహా వివిధ యూరోపియన్‌ దేశాలు ఆయా ఫార్మా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐతే, ఈ రేసులో పేద దేశాలు వెనుకబడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 'కోవాక్స్‌' పేరుతో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సంస్థ నుంచి అమెరికా వైదొలగడంతో నిధుల కొరత పీడిస్తోంది.

ప్రమాదం ముంగిట్లో..

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి 11 లక్షల మందిని పైగా పొట్టన పెట్టుకుంది. ఇక శనివారం నాటికి నాలుగున్నర లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. వాటిలో సగానికి పైగా ఐరోపా దేశాలకు చెందినవే కావటం గమనార్హం. ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలు కరోనా విజృంభణ ముంగిట్లో ఉన్నట్టు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ఇటీవల హెచ్చరించారు.

కరోనా పంపిణీ ఇలా..

దేశాలు తమ ప్రజలను మొదట కాపాడుకోవాలనుకోవటం సహజమేనని.. అయితే దీనివల్ల కొవిడ్‌ నిర్మూలనకు మరింత సమయం పడుతుందని.. త్వరగా తగ్గిపోదని టెడ్రోస్‌ విశ్లేషించారు. వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేయాలంటే దానిని అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొద్ది దేశాల్లో అందరికీ వ్యాక్సిన్‌ అందజేసేకంటే.. అన్ని దేశాల్లో కొందరి చొప్పున వ్యాక్సిన్‌ అందజేసే విధానం అనుసరణీయమన్నారు.

వ్యాక్సిన్లు ప్రజల ప్రాణాలను మాత్రమే కాకుండా సమాజాలను, దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా కాపాడే సాధనాలని డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ అథనోమ్‌ స్పష్టం చేశారు. కరోనాపై యుద్ధంలో ప్రతి అడుగూ ఐకమత్యంగా పడాలని తాజా సమావేశంలో ఆయన సూచించారు. ధనిక దేశాలు వ్యాక్సిన్‌ విషయంలో వెనుక బడిన దేశాలకు చేయూతనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ముప్పు ముంగిట్లో ఆ దేశాలు- డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details