తెలంగాణ

telangana

ETV Bharat / international

'టీకా అసమానతల'పై డబ్ల్యూహెచ్​ఓ ఆవేదన - టెడ్రోస్ అధనోమ్

టీకా పంపిణీలలో అసమానతలపై డబ్ల్యూహెచ్​ఓ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పేద దేశానికి 25 డోసులు మాత్రమే అందాయని, అదే సమయంలో 50 ధనిక దేశాల్లో 3.9 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది.

WHO VACCINE
'టీకా అసమానతల'పై డబ్ల్యూహెచ్​ఓ ఆవేదన

By

Published : Jan 18, 2021, 7:29 PM IST

కరోనా టీకాను వృద్ధుల కంటే ముందు యువతకు ఇవ్వడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబట్టింది. ధనిక దేశాల్లో ఆరోగ్యంగా ఉన్న యువతకు సైతం టీకాలు అందుతున్నాయని పేర్కొంది. ఇది సరైనది కాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో పేద దేశాలకు కరోనా టీకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వారం పాటు కొనసాగే డబ్ల్యూహెచ్​ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశాన్ని ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్.. ఓ పేద దేశానికి ఇప్పటికి 25 డోసులు మాత్రమే లభించాయని చెప్పారు. టీకా అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. డోసుల పంపిణీలో అసమానతలపై ఆవేదన చెందారు.

"అత్యంత తక్కువ ఆదాయం కలిగిన ఓ దేశానికి(పేరు ప్రస్తావించలేదు) ఇప్పటివరకు 25 డోసులు మాత్రమే అందాయి. 25 లక్షలు కాదు, 25 వేలు కాదు.. కేవలం 25. అదే సమయంలో 50 ధనిక దేశాలు తమ ప్రజలకు 3.9 కోట్లకు పైగా డోసులు అందించాయి."

-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

టీకా తయారీ సంస్థలతో పలు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టెడ్రోస్. అవసరానికి అనుగుణంగా అన్ని దేశాలకు టీకా సరఫరా చేసే డబ్ల్యూహెచ్​ఓ కార్యక్రమం 'కొవాక్స్'కు ఈ ఒప్పందాలు విఘాతం కలిగిస్తాయన్నారు. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ధనిక దేశాల్లోని నియంత్రణ సంస్థలకే టీకా సంస్థలు అత్యవసర వినియోగానికి దరఖాస్తులు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:'అందరికీ వ్యాక్సిన్ అందేంత వరకు​ విశ్రమించం'

ABOUT THE AUTHOR

...view details