Tedros Adhanom on Covid: కొవిడ్-19 మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయసెస్. దేశాల మధ్య అసమానతలను తొలగించి.. కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే ఈ మహమ్మారి అంతమవుతుందన్నారు.
"మహమ్మారి నుంచి ఏ దేశమూ బయటపడలేదు. అయితే, కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే.. మనం నియంత్రించలేనంతగా, కనీసం అంచనా వేయలేనంతగా.. వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే.. ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కొవిడ్-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో.. ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుంది."
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ అధినేత.
వచ్చే ఏడాది ప్రపంచం ఎదుర్కోబోయేది కొవిడ్-19 ఆరోగ్య ముప్పు ఒక్కటే కాదన్నారు టెడ్రోస్. లక్షలాది మంది ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ సేవలు, పలు అంటువ్యాధులు, ఇతర వ్యాధులకు చికిత్సలకు దూరమయ్యారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్ను పెద్దఎత్తున అందించాలని కోరారు. అత్యవసరంగా, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపడితే.. ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కాపాడగలుగుతామని సూచించారు.